Vangaveeti Radha planning to contest from Anakapalleఈ మధ్యనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన వంగవీటి రాధ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నిన్న తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఒకప్పుడు టీడీపీనే తన తండ్రి చావుకి కారణం అని చెప్పిన రాధా ఇప్పుడు అది కొందరి వ్యక్తుల పని అని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా విజయవాడ సెంట్రల్ సీటు కోసం వైకాపా ను వీడిన ఆయన లోక్‌సభ బరిలో దిగే యోచనలో ఉన్నారు. విజయవాడను వదిలేసి ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర వైపు ఆయన చూస్తున్నారు.

రసాపురం, అనకాపల్లి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీడీపీ అధిష్టానం ప్రతిపాదన పెట్టడంతో ఆయన ఆ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. రాధా అనకాపల్లిపై మొగ్గుచూపుతున్నారని సమాచారం. రెండు నియోజకవర్గాలలోనూ కాపులు ప్రభావం ఎక్కువగానే ఉంది. అయితే సొంత జిల్లా కృష్ణా జిల్లాను వదిలి వేరే చోట పోటీ చెయ్యడం సాహసమనే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్.. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

సొంత జిల్లాను వదిలి వెళ్తున్న వంగవీటి రాధాకు విశాఖ ఏమాత్రం కలిసొస్తుందో వేచి చూడాల్సిందే మరి. రాధ పోటీ చేస్తే ఆయనను అనకాపల్లికే పరిమితం చెయ్యకుండా కాపులు ఎక్కువగా ఉండే అన్ని నియోజకవర్గాలలోను తిప్పాలని చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. అన్నీ కుదిరితే సాయంత్రం బయటకు రాబోయే తెలుగుదేశం మొదటి లిస్టులోనే వంగవీటి రాధా పేరు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం.