విజయవాడలో వంగవీటి మోహన రంగాకున్న బ్యాక్ గ్రౌండ్ తెలియనిది కాదు. అలాంటి రంగా, రాధలకున్న చరిత్రను వక్రీకరించి, “వంగవీటి” పేరుతో సినిమాను తెరకెక్కించారన్న విషయం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పేదే. ఒక వర్గానికి అనుకూలంగా మలచడం కోసం వర్మ ఒప్పందం కుదుర్చుకుని, రంగా, రాధలను తక్కువగా చూపించారని రంగా తనయుడు అప్పట్లో హడావుడి చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అయితే తాజాగా స్థానిక కోర్టులో దీనిపై ఓ పిటిషన్ దాఖలు చేసారు.

“ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు, మాటలు… ఇలా ప్రతి ఒక్కటీ తప్పుగా చిత్రీకరించారు. ఈ వివరాలన్నింటినీ సేకరించి కోర్టులో అందజేశాం” అని తెలిపారు రాధ. గతంలో హైకోర్టులో కేవియట్ ఫైల్ చేసుకున్నారు, ఆ తర్వాత మేము కేసు వెనక్కి తీసుకోవడం జరిగింది, కంటెంట్ ఆఫ్ కోర్టు కింద అప్పుడు సినిమా ట్రైలర్, అభ్యంతరకర సన్నివేశాలను ఎత్తివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశాము. ఆ సన్నివేశాలను తొలగిస్తామని చెప్పి, సినిమా రిలీజ్ తర్వాత వర్మ మోసం చేశాడు.

తన వ్యక్తిగత అభిప్రాయాలను సినిమా తీసి చూపించడం కరెక్టు కాదు, మా పరువుకు భంగం కలిగించేలా ఈ సినిమా తీశారు. టైటిల్స్ లో కల్పిత పాత్రలు అని చెప్పకుండా నేరుగా వంగవీటి రంగా, వంగవీటి రాధా అని పేర్లు పెట్టారు. వంగవీటి రంగాను సినిమాలో రౌడీ పాత్రలో చూపించారు. నా తల్లి రత్నకుమారిని హత్యలు ప్రోత్సహించే పాత్రలో చూపించారు. మమ్మల్ని సంప్రదించకుండానే కుటుంబ చరిత్రను వర్మ తన ఇష్టానుసారంగా తీశారు. అసలు కథ తెలియకుండా తీశారని అన్నారు.

నేను ఎవరికీ వార్నింగ్ ఇవ్వడం లేదు. వార్నింగ్ ఇచ్చేవాడినే అయితే కోర్టును ఆశ్రయించేవాడినే కాదు. ప్రస్తుతం దర్శకుడు వర్మ, సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్, సహ నిర్మాత సుదీప్ చంద్రపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేసు పెట్టానని వంగవీటి రాధా తెలిపారు. వర్మ తీసినదంతా చరిత్రకు విరుద్ధమని విజయవాడ వాసులతో సహా చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అంతా ముగిసిపోయిన దరిమిలా, మళ్ళీ కేసులంటూ కొత్తగా కోర్టులకెక్కడం ఎంతవరకు తన కుటుంబ ప్రతిష్టకు ఎంతవరకు మేలు చేస్తుందో రాధనే ఆలోచించుకోవాలి.