Vangaveeti Radha - Mudragada Padmanabhamవంగవీటి మోహన రంగా వర్ధంతి వేదికగా జరిగిన వంగవీటి రాధా – వల్లభనేని వంశీ – కొడాలి నాని కలయిక ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాయి. ముఖ్యంగా ఈ కలయిక సందర్భంలో ‘తనపై హత్యాయత్నం చేయడానికి రెక్కీ నిర్వహించారని’ వంగవీటి రాధా వ్యక్తం చేసిన మాటలకు 24 గంటల లోపే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోవడం విశేషం.

వంగవీటి రాధకు 2+2 సెక్యూరిటీ పెంచుతూ ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేయడం ఊహించని పరిణామం. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టిడిపికి విచ్చేసిన రాధ, ఎన్నికలలో ఓటమి పాలు కాగా, అప్పటినుండి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం తెలుగుదేశంలో కూడా యాక్టివ్ గా లేని రాధ చూపు మళ్ళీ వైసీపీ వైపుకు మళ్లిందా? అన్నది పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గడిచిన రెండు రోజుల నుండి ఇంత జరుగుతున్నా, తెలుగుదేశం పార్టీ నుండి ఎలాంటి స్పందన లేదు. ప్రతిసారి ఎన్నికలకు ముందు పార్టీ మారతారని విజయవాడ ప్రజానీకంలో ఓ విధమైన అభిప్రాయాన్ని కలుగజేసిన రాధ మళ్ళీ పార్టీ మార్పుకు సిద్ధమైతే, రాజకీయంగా ఎవరికెంత లాభం అన్నది పక్కన పెడితే, ఏపీలో కాపు సామాజిక వర్గం కేంద్రంగా రాజకీయం వేడెక్కే విధంగా అవకాశాలు కనపడుతున్నాయన్న చర్చ జరుగుతోంది.

ఓ పక్కన ముద్రగడ పద్మనాభం కొత్త పార్టీ పెట్టబోతున్నారని, దీనికి రాజకీయంగా జగన్ అండదండలు ఉన్నాయని ఇప్పటికే ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇందులో నిజానిజాలు ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రాక ముందే వంగవీటి రాధ కేంద్రంగా మళ్ళీ అదే సామాజిక వర్గం వార్తల్లో నిలవడం అనేది కాకతాళీయమో లేదో గానీ, ఈ రెండు ఉదంతాలు అధికార పార్టీ ఆశీస్సులతోనే జరుగుతున్నాయన్న చర్చ మాత్రం ఊపందుకుంది.

ఇటీవల వెల్లడైన ఓ సర్వేలో తెలుగుదేశం పార్టీకి, జనసేన తోడయితే అధికార వైసీపీ ఇరుకున పడడం ఖాయమని స్పష్టమైంది. దీంతో జనసేన ఓటింగ్ ను కొంతైనా చీల్చే ప్రక్రియలో భాగంగా కాపు సామాజిక వర్గం కేంద్రంగా రాజకీయం జరుగుతోందా? అంటే… దానికి ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం గానీ, పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ అయితే ప్రస్తుతం వార్తల్లో ప్రధానంగా నిలుస్తోంది.