Vangaveeti Radha joins Pawan Kalyan JanaSenaవైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన వంగవీటి రాధ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎన్నికలకు ముందు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఒకప్పుడు టీడీపీనే తన తండ్రి చావుకి కారణం అని చెప్పిన రాధా ఇప్పుడు అది కొందరి వ్యక్తుల పని అని చెప్పుకొచ్చారు. టీడీపీ తరపున చాలా నియోజకవర్గాలలో ప్రచారం కూడా చేశారు. ఎన్నికల పోలింగ్ తరువాత చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఏదో యాగం కూడా చేశారు.

అయితే టీడీపీలో చేరడం ఆయన అనుచరులకు నచ్చలేదు. ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ లోనే ఉంటే ఖచ్చితంగా కాపు కోటాలో ఉపముఖ్యమంత్రి అయ్యేవాడని చాలా మంది అభిప్రాయం. ఇది ఇలా ఉండగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో ఆయన కాసేపటి క్రితం భేటీ అయ్యారు. అరగంట పాటు పవన్ కల్యాణ్‌తో వంగవీటి రాధా చర్చించారు. త్వరలో వంగవీటి రాధా జనసేనలో చేరే అవకాశమున్నట్లు సమాచారం. పార్టీలో చేరేందుకే ఆయన పవన్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం కూడా ఆయన అనుచరులకు షాక్ అనే చెప్పుకోవాలి. గత ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయింది జనసేన పార్టీ. ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తుంది. కీలక నేతలు ఇప్పటికే తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ సమయంలో జనసేనలో చేరడం అంటే సాహసమే అనుకోవాలి. ఎప్పుడూ అనాలోచిత చర్యలేనా? వారు వాపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లలేకపోతే కనీసం బీజేపీలోనైనా చేరిఉండాల్సింది కదా అంటున్నారు వారు. అయితే ఎప్పుడూ అనుకోనిది చెయ్యడమే వంగవీటి పంథా.