Vangaveeti Radha about YS jaganఇటీవలే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని, ఈ అవమానాలు వేరెవరికీ జరగకూడదని బయటకు వచ్చా అని ఆయన చెప్పారు. “పార్టీలో చేరేటప్పుడు.. తమ్ముడిలా చూసుకుంటానని చెప్పి జగన్‌ మోసం చేశారు. నీ తండ్రి మీద జాలిచూపించి పార్టీలో ఉండనిచ్చా అని పదేపదే అనేవాడు. నేను వదిలిస్తే గాలికి పోతావని అని కూడా అనేవాడు” అని వంగవీటి చెప్పారు.

“మా తండ్రి విగ్రహావిష్కరణకు వెళితే.. ఎవరి అనుమతి తీసుకున్నావని ప్రశ్నించారు… ఇదెక్కడి న్యాయం?,” ఆయన ప్రశ్నించారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పారు. అభిమానంతో కొంతమంది భోజనాలు పెడితే.. అది కూడా పొరపాటైపోయిందన్నారు. లోకల్ ఇంఛార్జీకి చెప్పలేదని.. తనను ప్రశ్నించారన్నారు. “నన్ను చంపేస్తామని సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయి. నా ప్రాణం కంటే నా తండ్రి ఆశయం ముఖ్యం.. రంగా అనే వ్యవస్థను బతికించాలి,”అని రాధా ఆవేదన వ్యక్తం చేశారు.

“ఎవడైనా నా కిందే. నేనే సర్వం. ఎవరైనా నా కింద పని చేయ్యాల్సిందే. మీ పార్టీలో మీ మాటే చెల్లుతుంది. అయితే అంతా నేనే అని ఎవరికీ కనీసం గౌరవం ఇవ్వను అంటే మాత్రం కుదరదు,” రాధా చెప్పారు. ఇదే సమయంలో ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. టీడీపీలో చేరుతున్నారనే ప్రచారంపై మీడియా ప్రశ్నించగా.. ఆయన ఆవేశంగా స్పందించారు. “విజయవాడలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే చాలని మాత్రమే చెప్పా. అది నా తండ్రి ఆశయం,” అని చెప్పుకొచ్చారు.

అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రంగా హత్య కొందరు వ్యక్తుల పని అని, దానిని టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు. రంగాను అభిమానించేవాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని వంగవీటి పేర్కొన్నారు. అయితే ఆయన టీడీపీలో రేపే చేరతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయనకు పదవి గారంటీ అని పుకార్లు షికారు చేస్తున్నాయి. వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో విజయవాడ సెంట్రల్ సీటును ఆశించారు రాధా. అయితే దానిని మల్లాది విష్ణుకు కేటాయించారు జగన్. ఆ తరువాత నుండి పొమ్మనలేక పొగ బెట్టి చివరకు ఆయన బయటకు పంపించేశారని రంగా అభిమానుల అభిప్రాయం.