Vangalapudi Anitha comments vahanamithra schemeసిఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖలో వాహనమిత్ర పధకం కోసం రూ.261.51 కోట్లు నిధులు విడుదల చేశారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 2.61 లక్షల మంది ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున అందుతుంది. “మీ జగనన్న ఇక్కడ బటన్ నొక్కగానే నేరుగా మీ ఖాతాలలో పడిపోతుంది,” అని గర్వంగా చెప్పుకొన్నారు.

దీనిపై ఏపీ రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మంగళగిరి టిడిపి కార్యాలయంలో స్పందిస్తూ, “రాష్ట్రంలో సుమారు 7.62 లక్షల మంది అర్హులు ఉంటే జగన్ కేవలం 2.61 లక్షల మందికి మాత్రమే ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆ ఇచ్చిన 10వేలు కూడా మీ ప్రభుత్వం వారి వాహనాలపై వేస్తున్న చలాన్లకు కూడా సరిపోవు. గతుకుల రోడ్లలో ప్రయాణిస్తున్న వాహనాల మరమత్తులకు సరిపోవు. కనీసం ఒకనెల పెట్రోల్, డీజిల్ ఖర్చులకు కూడా సరిపోవు. మరి దేనికి ఇస్తున్నట్లు? దాంతో వారు ఏమి చేసుకోవాలి?

ఆటోలు, క్యాబ్‌లు, టాక్సీలపై జరిమానాలు పెంచుతూ జీవో నంబర్: 21 ఎందుకు జారీ చేశారు?వాహనమిత్రతో 10వేలు ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ చలాన్లు విధించి వసూలు చేసుకోవడం వారిని మోసగించడం కాదా? పెట్రోల్, డీజిల్‌ ధరలపై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినా మీ ప్రభుత్వం తగ్గించేదేలేదని నిసిగ్గుగా చెప్పుకొంటోంది. అంటే మళ్ళీ ఆవిదంగాను వాహనమిత్ర సొమ్మును వెనక్కు తీసుకొంటోంది కదా?

గతుకుల రోడ్లపై ప్రయాణించడానికి భయపడి మీరు 2 కిమీ ప్రయాణించడానికి కూడా హెలికాప్టర్‌ వాడుతున్నారు. మరి ఆటో, టాక్సీ, క్యాబ్‌లు ప్రతీరోజూ ఆ గతుకుల రోడ్లపైనే వందలాది కిమీ ప్రయాణిస్తుండటం వలన వారి వాహనాలు తరచూ మరమత్తులు చేయించుకోవలసి వస్తోంది. మీరిచ్చిన సొమ్ము కనీసం వాటికి కూడా సరిపోదు కదా?రోడ్లను మరమత్తులు చేయించలేక వాహనమిత్ర ఇచ్చి వారిని మభ్యపెడుతున్న మాట వాస్తవం కాదా?

మీరు జిల్లా పర్యటనలకు వస్తుంటే మీ కాన్వాయ్‌ కోసం పోలీసులు ప్రైవేట్ ట్రావెల్స్, స్కూలు యాజమాన్యాలను బెదిరించి కార్లు, బస్సులు తీసుకుపోవడాన్ని ఏమనాలి? విశాఖలో మీరు పర్యటనకు వస్తుంటే 34 ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు మూసుకోవలసి వచ్చింది?” అంటూ సిఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.