Vamshi Paidipallyసినిమాలన్నాక హిట్లు ఫ్లాపులు సహజం. అలాగే పబ్లిక్ టాకులు రివ్యూలు రకరకాలుగా వస్తాయి. కంటెంట్ లో దమ్ముంటే వీటి ప్రభావాన్ని తట్టుకుని మరీ విజయం సాధించవచ్చని చాలాసార్లు ఋజువయ్యింది. ఫిలిం మేకర్ కి కావాల్సింది తాను ఎందుకు గెలుస్తున్నాను ఎక్కడ ఓడుతున్నాను అని తెలుసుకోవడం. అంతే తప్ప సానుభూతి మీద ప్రేక్షకులు టికెట్లు కొనే కాలం ఎప్పుడూ లేదు. కానీ వారసుడు దర్శకుడు వంశీ పైడిపల్లి వాదన మాత్రం మరీ విచిత్రంగా ఉంది. తమిళంలో వరిసు పేరుతో విడుదలైన తన కొత్త మూవీ మీద కోలీవుడ్ మీడియాలోనూ మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీవీ సీరియల్ తరహాలో ఉందన్న కామెంట్స్ గట్టిగానే చేశారు.

ఒక ఛానల్ ఇంటర్వ్యూలో యాంకర్ ఈ విషయాన్నే నేరుగా వంశీ పైడిపల్లినే అడిగేశాడు. దానికాయన అరవం ప్లస్ ఇంగ్లీష్ లో చెప్పిన సమాధానం ఇది. ఇప్పటి రోజుల్లో ఒక సినిమా తీయడం వెనుక ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా, ఒక టీమ్ ఎన్ని త్యాగాలు చేస్తే రూపొందుతుందో మీకు అర్థమవుతుందా, విజయ్ లాంటి నటుడు ఈరోజుకి డైలాగు చెప్పేముందు రిహార్సల్ చేసుకుంటారు. ఆయన నాకు రివ్యూ రైటర్ ఆయనే నాకు క్రిటిక్. అయినా టీవీ సీరియల్స్ ని ఎందుకు తక్కువ చేసి చూస్తారు. ఎన్ని కోట్ల మంది సాయంత్రాలు వాటిని చూస్తారో మీకు తెలుసా. వాటిని డీ గ్రేడ్ చేసే హక్కు మీకు లేదు బ్రదర్. ఇంత నెగటివిటీ ఉంటే అది మీకే నష్టం కానీ నాకు కాదు.

చూశారుగా. అంతా బాగానే ఉంది కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకునేది డైరెక్షన్ చేయడానికి నటించడానికే కదా. ఇక్కడ త్యాగాల ప్రసక్తి ఎందుకు. విజయ్ కానీ ఇంకో హీరో కానీ ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు. డబ్బులు తీసుకున్నందుకే తప్ప వేరే కారణం ఉంటుంది. పోనీ ఆడియన్స్ కి టికెట్ మీద ఒక ఇరవై రూపాయలు తగ్గుతుందని ఎప్పుడైనా రెమ్యునరేషన్లు తగ్గించుకున్న స్టార్లు చరిత్రలో ఉన్నారా లేదే. ఇది డిమాండ్ అండ్ సప్ప్లై ఆధారంగా నడిచే పరిశ్రమ. రెండు వేలు పెట్టి టికెట్ కొని ఫ్యామిలీతో థియేటర్ కు వచ్చే సగటు మనిషికి అందులో కోరుకున్న వినోదం దక్కనప్పుడు రియాక్ట్ అవుతాడు. రివ్యూ రాసేవాడైనా మాములుగా చూసేవాడైనా అందరిదీ ఒకే కోణం.

ఇదే విషయాన్ని గతంలో ఖైదీ విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ను అడిగినప్పుడు తన స్పందన ఇలా లేదు. మనం ఎంత కష్టపడ్డామన్నది అనవసరం. కోట్లు ఇస్తోంది అందుకేగా. అలాంటప్పుడు వంద రూపాయలు టికెట్ కొన్నవాడిని నేను సంతృప్తి పరచాలి. అది చేయలేనప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది. దానికి బాధ్యత తీసుకోవాలి. అంతే తప్ప అయ్యో సెట్లో ఇంత చెమట చిందించావా అని ఎవరూ జాలి చూపరు. ఇది ముమ్మాటికీ కరెక్ట్. అయినా కష్టం ప్రతిపాదికన సినిమాలను ఆదరించాలంటే రాధే శ్యామ్, థగ్స్ అఫ్ హిందుస్థాన్ లాంటి వాటిని కూడా బ్లాక్ బస్టర్లను చేసి పెట్టాలి. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో వల్లే వంశీ అరవ బ్యాచ్ కి టార్గెట్ అయిపోయాడు.