Vijay-Deverakonda in Jana Gana Mana‘మూడు నెలల్లోనే సినిమా పూర్తి చేసి ఇండస్ట్రీ రికార్డులను ఎలా అందుకోవాలో పూరీ దగ్గరకు వెళ్లి నేర్చుకోండి’ – ఇది ఓ స్టేజ్ మీద దర్శకధీరుడు రాజమౌళి తన భార్య తనతో చెప్పినట్లుగా చేసిన ప్రకటన. నిజమే… పూరీ జగన్నాధ్ స్టైల్ అలాగే ఉంటుంది. హీరో ఎవరైనా సరే… జయాపజయాలకు అతీతంగా మూడు, నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేయడం పూరీ రొటీన్ గా చేసే విషయం.

కానీ ప్రస్తుతం తుది రూపు దిద్దుకుంటోన్న “లైగర్” విషయంలో పూరీ ప్లానింగ్ తప్పింది. 2020లో ప్రారంభించిన ఈ సినిమా అనేక వాయిదాల నడుమ, ఎట్టకేలకు ఈ ఏడాది ఆగష్టులో విడుదలకు నోచుకుంటోంది. ఈ సినిమా వాయిదాలకు కరోనా ప్రధాన కారణం కరోనా కాగా, నేడు ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన “జనగణమన” రిలీజ్ డేట్ కూడా చర్చనీయాంశమైంది.

2023, ఆగష్టు 3వ తేదీన ఈ సినిమా విడుదల అని స్పష్టం చేయడంతో, ‘జనగణమన” సినిమా షూటింగ్ కు దాదాపుగా ఏడాదిన్నర్ర సమయాన్ని తీసుకుంటున్నారు పూరీ. ప్రస్తుతం కరోనా నిబంధనలు లేవు. లైఫ్ స్టైల్ అంతా సజావుగా సాగుతోంది. అయినప్పటికీ ఏడాదికి పైనే సమయం తీసుకోవడం అనేది, సినిమా పర్ ఫెక్ట్ గా రావడానికి తీసుకున్న సమయమా? లేక పాన్ ఇండియా స్థాయి సినిమా గనుక మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, హడావిడిగా కాకుండా నింపాదిగా షూటింగ్ చేసుకోవాలని భావిస్తున్నారా?

ఈ సినిమాకు మహేష్ కు మిత్రుడు, ‘మహర్షి’ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. చివరి నిముషంలో ఎంట్రీ ఇచ్చిన వంశీ ఓ విధంగా షాక్ ఇచ్చారు. ఈ కధ మొదటగా మహేష్ వినడం, ఇప్పుడు చివరి నిముషంలో మహేష్ కు ఎంతో సన్నిహితంగా ఉంటున్న వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండడం టాలీవుడ్ లో కొంత చర్చనీయాంశంగా మారింది.

పూరీ డ్రీం ప్రాజెక్ట్ గా “జనగణమన”ను వివిధ సందర్భాలలో పేర్కొన్నారు. అలాంటి డ్రీం ప్రాజెక్ట్ కోసం మరో దర్శకుడిని నిర్మాతగా చేర్చుకోవడంతో పాటు, తన రొటీన్ శైలికి విరుద్ధంగా ఒక ఏడాది పాటు షూటింగ్ కు అవకాశం ఇవ్వడంతో… ప్రారంభ రోజు నుండే “జనగణమన” హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మిగిలిన తారాగణం ఎంపిక కావాల్సి ఉంది.