Vallabhaneni Vamsi place in andhra pradesh assembly--సీఆర్‌డీఏ రద్దు, రాష్ట్రంలో అధికార, పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలతో అధికారపక్షం విస్తుబోయింది. శాసనసభలో 175 స్థానాలలో 151 స్థానాలతో .. 80 శాతంపైగా సభ్యులను కలిగి బిల్లులను ఆమోదిస్తే.. శాసనమండలిలో తిరస్కరణకు గురికావడం ముఖ్యమంత్రికి మింగుడుపడలేదు. దీనితో మండలి రద్దుకు పూనుకున్నారు.

అయితే మండలి రద్దు వల్ల అధికార పార్టీకి సమస్యలు లేకపోలేదు. ఇప్పటికిప్పుడు ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చెయ్యాల్సిన పరిస్థితి. అదీ కాకుండా ఇప్పటికే హామీ ఇచ్చిన కొందరు నేతలకు జగన్ ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఈ నిర్ణయం గన్నవరం పరిస్థితి మరింత క్లిష్టంగా మార్చబోతుంది.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల అనంతరం వైసీపీకి జై కొట్టడంతో ఎన్నికల్లో వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుకు శాంతపరచడానికి జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. అలాగని వంశీ, వెంకట్రావు ఇద్దరికీ టిక్కెటు ఇచ్చే అవకాశం లేదు.

దీనితో ఇద్దరిలో ఒకరికి ఇబ్బంది తప్పదు. కాదు కూడదు అనుకుంటే వెంకట్రావుని రాజ్యసభకు పంపాలి. అయితే ఇప్పటికే రాజ్యసభ ఆశావహుల లిస్టు చాంతాడంత ఉంది. టీడీపీ నుండి ఆకర్షించే నేతలకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చే అవకాశం కూడా ఇప్పుడు జగన్ కు లేకుండా పోయింది.