vallabhaneni vamsi to join ysrcp without resigning to MLA postగన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన పదవికి రాజీనామా చెయ్యాలనే ఆలోచన విరమించుకున్నట్టుగా ప్రకటించారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఎప్పుడు అనేది మాత్రం తొందరలో తెలుస్తుంది అని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాలంటే రాజీనామా చేసి రావాలి అనేదాని మీద చర్చ జరగలేదు అని వంశీ చెప్పడం కొసమెరుపు.

“ఎమ్మెల్యేగా ప్రజలకు ఏ పని చెయ్యకుండా అయిపోయింది. వేధింపుల నుండి తన మద్దతుదారులను, అనుచరులను కాపాడుకోవడం కోసమే పార్టీ మారుతున్నా,” అని వంశీ చెప్పారు. అయితే పార్టీ మారుతూ కూడా ఏ పార్టీ అయితే వేధిస్తుందో అదే పార్టీలో చేరుతున్న అని ప్రకటించడం విశేషం.

దానిని అధికార పార్టీ హర్షిస్తుందో లేదో చూడాలి. బహుశా గంటా శ్రీనివాసరావు టీడీపీలో చీలిక తెచ్చి టీడీపీ లెజిస్లేటివ్ పార్టీని బీజేపీలో కలిపితే, తాను వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరినా రాజీనామా చెయ్యక్కర్లేదు అని వంశీ ఆలోచన కావొచ్చు.

వంశీ స్థానికంగా బలమైన నేత. వరుసగా రెండు సార్లు గన్నవరం నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెటు పై గెలుస్తూ వచ్చారు. ఇటీవలే ఎన్నికలలో క్లిష్టమైన పరిస్థితులలో టీడీపీ నుండి గెలిచిన 23 ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు. పార్టీ మారడం అంటూ జరిగితే టీడీపీ నుండి మారే మొదటి ఎమ్మెల్యే కూడా ఆయనే.