Vallabhaneni_Vamsiగన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల మద్య విభేధాలు మరోసారి భగ్గుమన్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిస్తూ అవినీతికి పాల్పడుతున్నాడని వైసీపీ సీనియర్ నేత యార్లగడ్డ వెంకట రావు ఆరోపించడంపై వంశీ ఫైర్ అయ్యారు.

గన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ, “అసలు ఆయనకు ఇంగిత జ్ఞానం ఉంటే కదా? నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాడు. అది కేవలం మట్టి. దీనిని మట్టే అంటారు బంగారం అనరు. ఇదేమీ బాక్సైటో, గ్రాఫైటో మరొక ఖనిజమో కాదు విదేశాలకు తరలించడానికి. ఏ ఊరు మట్టి ఆ ఊరులో ఉపయోగించుకోవాలంటేనే జేసీబీ, ట్రాక్టర్, లేబర్ ఖర్చులకు తడిపిమోపెడు అవుతుంది. ఇక దానిని అక్రమంగా వేరే ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకోవడం సాధ్యమా?

మట్టి తవ్వకం అంటే మాంసం కంటే మసాలాకు ఎక్కువ ఖర్చువంటి వ్యవహారం. కనుక ఇందులో ఎప్పుడూ తగులే తప్ప మిగులుండదని తెలియని ఆజ్ఞానులు రాజకీయాలలోకి వస్తే ఏమవుతుందంటే బీదాళ్ళు ఇబ్బంది పడతారు. ఇక్కడ మట్టి తవ్వితే మహా అయితే చుట్టుపక్కల గ్రామాలకు తరలించవచ్చునేమో కానీ ఇక్కడ మట్టిని తీసుకువెళ్ళి కుప్పంలో అమ్ముకోగలమా?పోలవరం గట్టు మీద కొన్ని కోట్ల క్యూబిక్ టన్నుల మట్టి పడి ఉంది దానిని ఎవరైనా ఎత్తుకుపోయారా? ఎందుకంటే మట్టి తరలింపు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కనుక. వీళ్ళు వాగే పిచ్చి వాగుడు వలన జగనన్న కాలనీలో ఇళ్ళు కట్టుకొనే పెదాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు.

వీళ్ళకి ఏమీ తెలియదు కానీ నోటికి వచ్చినట్లు వాగుతుంటారు. నేను వెళుతుంటే నాపై బురద జల్లుతుంటారు. మరి ఉతుక్కోవాలి కనుక ఇలా మీడియా ముందుకు వచ్చి జవాబు చెప్పక తప్పడం లేదు. నన్ను ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకొన్నారు. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డిగారు నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. వాటిని నేను చేసుకుపోతున్నాను. మద్యలో ఇలాంటి సినిమా పాటగాళ్ళు వచ్చి ఏదేదో పాడుతుంటారు. ఇలాంటి దారినపోయే దానయ్యాలను నేను పట్టించుకోనవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి నాపై ఏమైనా పిర్యాదులు ఉంటే జగన్మోహన్ రెడ్డిగారికి నిరభ్యంతరంగా ఫిర్యాదు చేసుకోవచ్చు.

పార్టీలో ఒకాయన ఉన్నాడు. ఎవరూ పిలవకపోయినా ఎవరింట్లో భోజనం పెడుతుంటే అక్కడ వాలిపోతుంటాడు. ఒకాయన పర్మనెంట్…ఆయన ఏ పని చేయడు. మరొకాయన టెంపరరీ. అప్పుడప్పుడు కనిపించిపోతుంటాడు. ఇంకో ఆయన ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి డబ్బులిస్తే తీసుకుపోతుంటాడు. ఇటువంటి వాళ్ళ గురించి నేనేమీ మాట్లాడాలి.

నాకు గత 16 ఏళ్ళుగా గన్నవరం నియోజకవర్గం ప్రజలతో అనుబందం ఉంది. కనుక ఆ మమకారంతోనే నేను గెలిచినా ఓడినా ప్రజల మద్యే ఉంటూ వారికి నేనేమి చేయగలనో అదే చేస్తున్నాను తప్ప ఎన్నికలప్పుడు తాజ్ మహల్ లేదా కుతుబ్ మీనార్ కట్టిస్తానని హామీలు ఇవ్వలేదు.

నేను టిడిపిలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి పనులు చేయించుకొన్నవాళ్ళున్నారు. అలాగే ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు టిడిపికి చెందినవాళ్ళు నాదగ్గరకు వచ్చి సంక్షేమ పధకాల కోసమో లేదా ఇళ్ళ పట్టాల కోసమో వస్తూనే ఉంటారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పధకాలు నా నియోజకవర్గంలో అందరికీ అందేలాచేస్తుంటాను.

నేను దాదాపు 15 సినిమాలు తీశాను. అందులో ఇలాంటి రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. నా గురించి వాడెవరో ఏదో అన్నాడట కదా? వాడో పెద్ద మహేష్ బాబు. వాడి పక్కన మరొకడు ఉంటాడు… వాడో ప్రభాస్. వాళ్ళు నన్ను ఏదో అనటం… నేను వారికి జవాబులు చెపుతుండటం నాకు ఇదే పనా?” అంటూ వల్లభనేని వంశీ కడిగేశారు.