క్షమాపణలు... ఇట్లు మీ వల్లభనేని వంశీ..!‘తన భార్యని అనరాని మాటలు అంటున్నారు’ అంటూ బోరున విలపించిన చంద్రబాబువి ఒట్టి నాటకాలు, అసలు భువనేశ్వరి గారిని ఎవరూ ఏ ఒక్క మాట కూడా అనలేదు, ఏం అన్నారో బయటకు చెప్పండి, ఇదంతా చంద్రబాబు తన రాజకీయ మనుగడ కోసం చేస్తున్నారు… అంటూ ఇప్పటివరకు పలికిన వైసీపీ నేతలకు వల్లభనేని వంశీ గట్టి షాక్ నే ఇచ్చారు.

“అసెంబ్లీలో భువనేశ్వరి గారి మీద ఒక మాట పొరపాటుగా అన్నది నిజమేనని, అందుకు తాను క్షమించమని కోరుతున్నానని, తన మనఃసాక్షి అంగీకరించడం లేదని, అందుకే ఈ క్షమాపణలు చెప్తున్నానని, తాను ఒకటి అనబోయి మరొకటి సభలో వ్యాఖ్యానించానని, భువనేశ్వరి గారితో సహా నా మాటలు ఎవరిని బాధించినా వారందరికీ క్షమాపణలు చెప్తున్నానని” ఓ మీడియా చర్చలో తెలిపారు.

వల్లభనేని వంశీ మరియు కొడాలి నానిలను కులం నుండి వేలేయాలంటూ సదరు కుల సంఘం తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతున్న సమయంలో వల్లభనేని వంశీ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తాన్ని వ్యక్తం చేసారు. అయితే ఇదేదో కుల సంఘం వెలేసినందుకు తీసుకున్న నిర్ణయం కాదని, నిజంగానే తాను ఆ మాట అని ఉండకూడదని, తప్పును సవరించుకోవడానికే ‘సారీ’ చెప్తున్నానని అన్నారు.

దీంతో వైసీపీ వర్గాలు డిఫెన్స్ లో పడ్డాయి. చంద్రబాబు ఇప్పటివరకు చేసిందంతా రాజకీయం కోసం కాదని, నిజంగా బాధపడ్డారని వంశీ వ్యాఖ్యలతో స్పష్టమైంది. నాడు వంశీ చేసిన వ్యాఖ్యలు సభంతా విని కూడా ముఖ్యమంత్రి మొదలుకుని, స్పీకర్ తో సహా వైసీపీ నేతలందరూ చంద్రబాబు ఏడుపుని హేళన చేస్తూ మాట్లాడిన వైనంలో అసలు “వాస్తవం” ఇపుడు ప్రజలకు అవగతమైంది.