Vallabhaneni_Vamsi_Yarlagada_Venkat_Raoసిఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి ఇంకా రెండేళ్ళ సమయం ఉండగానే ఎన్నికల హడావుడి ప్రారంభించడంతో తేనెతుట్టెను కెలికినట్లయింది. కొన్ని నియోజకవర్గాలలో ఇద్దరు, మరికొన్ని చోట్ల ముగ్గురు, నలుగురు అభ్యర్ధులు టికెట్ ఆశిస్తుండటంతో “ఈసారి టికెట్ నాకే…అంటే కాదు నాకే…” అంటూ వాదోపవాదాలు చేసుకొంటూ మీడియా ముందుకు వచ్చి పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూ పార్టీ పరువు తీస్తున్నారు. ఒకరి బండారం మరొకరు బయటపెట్టుకొంటూ ఇంతవరకు సామాన్య ప్రజలకు తెలియని అనేక రహస్యాలను వారి నోటితో వారే బయట పెట్టుకొంటున్నారు.

గన్నవరం నియోజకవర్గంలో టిడిపి నుంచి వచ్చిన వల్లభనేని వంశీకి, దుత్తా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావుల మద్య ఇప్పటికే పంచాయతీ నడుస్తోంది. వారి పంచాయతీ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరి వద్దకు వెళ్ళింది కూడా. వారు ముగ్గురికీ సర్దిచెప్పేందుకు జగన్, సజ్జల ప్రయత్నించారు. కానీ వారి ముందు బుర్ర ఊపి బయటకు వచ్చిన తరువాత మళ్ళీ వల్లభనేని వంశీ, దుత్తా రామచంద్రరావు పరస్పరం విమర్శలు చేసుకొన్నారు.

ఈసారి గన్నవరం నుంచి టికెట్ నాకే అని వంశీ ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు కూడా మీడియా ముందుకు వచ్చి “ఈసారి గన్నవరం టికెట్ నాకే ఎందుకంటే నియోజకవర్గంలో సమస్యలు, పార్టీ పరిస్థితి, ప్రజల అవసరాలు అన్నీ నాకంటే బాగా తెలిసినవారెవరూ లేరు కనుక,” అని చెపుతూనే చంద్రబాబు నాయుడు అంటే తనకు గౌరవం అని చెప్పడం విశేషం.

“అంటే… ఒకవేళ వైసీపీ మీకు టికెట్ ఇవ్వకపోతే టిడిపిలోకి వెళ్ళిపోతారా?” అనే విలేఖరి ప్రశ్నకు “అలాగని నేనేమీ చెప్పలేదు కదా? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ రెండు పార్టీలకు అధినేతలు. కనుక జగన్మోహన్ రెడ్డిని ఎంత గౌరవిస్తానో చంద్రబాబు నాయుడుని కూడా అంతే గౌరవిస్తానని మాత్రమే చెప్పాను. నేను ఏనాడూ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులపై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు,” అని చెప్పారు.

“మరి వల్లభనేని వంశీ కూడా ఈసారి తనకే టికెట్ వస్తుందని నమ్మకంగా చెపుతున్నారు కదా?మరి మీకెలా వస్తుందనుకొంటున్నారు? సిఎం జగన్మోహన్ రెడ్డి మీకేమైనా హామీ ఇచ్చారా?” అనే ప్రశ్నకు “ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నవారెవరో, అవినీతిపరులెవరో మా అధిష్టానానికి బాగా తెలుసు. కనుక ఎవరికి టికెట్ ఇవ్వాలో మా అధిష్టానమే నిర్ణయిస్తుంది,” అని చెప్పారు.

రాష్ట్రంలో ఇది ఒక నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయతీ. ఇటువంటివి మరో 174 నియోజకవర్గాలున్నాయి. ఇంచుమించు అన్ని చోట్ల ఇదే కధ నడుస్తోంది. మరి పార్టీలో నడుస్తున్న ఈ టికెట్ల పంచాయతీల సంగతి ఆలోచించకుండా 175 సీట్లు మనమే గెలుస్తామని సిఎం జగన్మోహన్ రెడ్డి ఏవిదంగా చెపుతున్నారో?