Vallabhaneni Vamsi admitted in hospital at mohali గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హటాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన ఓ పక్క రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూనే మరోపక్క ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్‌లో గత ఏడాది సీటు సాధించడం విశేషం. మొన్న సోమవారం నుంచి వంశీ పంజాబ్‌లోని మొహాలీ క్యాంపస్‌లో ఉంటూ అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్‌ పబ్లిక్ పాలసీ (ఏఎంపీపీపీ) కోర్సులో మూడో సెమిస్టర్ తరగతులకు హాజరవుతున్నారు.

నిన్న (మంగళవారం) తరగతికి హాజరైనప్పుడు ఎడమచేయి లాగుతున్నట్లు అనిపించడంతో వెంటనే స్థానిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరారు. వైద్యులు ఆయనకు ఈసీజీ, 2డి ఈకో తదితర గుండె సంబందిత పరీక్షలు చేసి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఒకటి రెండు రోజులలో హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

వల్లభనేని వంశీ టిడిపిని వీడి వైసీపీలో చేరినప్పటి నుంచి గన్నవరంలో వైసీపీ సీనియర్ నేతలు యార్లగడ్డ వెంకట రావు, దుత్తా రామచంద్రరావుల నుంచి రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిద్దరూ వంశీపై తరచూ అవినీతి ఆరోపణలు చేస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి వంశీపై పిర్యాదులు చేస్తున్నారు. వారిలో యార్లగడ్డ వెంకటరావు తరచూ మీడియా ముందుకు వచ్చి వచ్చే ఎన్నికలలో గన్నవరం శాసనసభ టికెట్ నాకే వస్తుంది అంటూ వంశీ గురించి చులకనగా మాట్లాడుతున్నారు. దీంతో వంశీ కూడా స్పందించక తప్పడం లేదు. బహుశః ఈ రాజకీయ ఒత్తిళ్ళే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నట్లున్నాయి. కానీ రాజకీయాలలో ఉన్నవారికి ఈ ఆటుపోట్లు వాటితో గుండెపోట్లు భరించక తప్పదు కదా?