Vallabhaneni Vamsi 2019 elections TDP YSRCPగన్నవరం ఎమ్మెల్యేగా కంటే విజయవాడ రాజకీయాల్లో ఎక్కువగా వల్లభనేని వంశీ పేరు హల్చల్ చేస్తుంటుంది. పోలీస్ కమీషనర్ వార్నింగ్ లు తదితర ఉదంతాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వల్లభనేని వంశీ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – వైసీపీ ఉదంతంలోనూ హైలైట్ అయ్యారు. దీనికి తోడు ఇటీవల కాలంలో తానూ ప్రత్యర్ధిగా భావించిన దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) టిడిపిలో చేరడంతో కృష్ణాజిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే ఈ పరిణామాలపై అసలు వంశీ మనసులో ఏముందో చెప్పే ప్రయత్నం చేసారు ప్రముఖ టెలివిజన్ యాంకర్.

అయితే సదరు యాంకర్ కు వంశీ కోటరీలోకి ఎంటర్ కావడంతోనే పరోక్ష హెచ్చరికలు ప్రారంభమవడం విశేషం. సదరు మీడియా ప్రతినిధి సహజంగా వినియోగించే ‘సెటిల్మెంట్’ అన్న పదం రాగానే, వంశీ కోటరీలో ఉన్న వారంతా సదరు మీడియా ప్రతినిధి వ్యాఖ్యలను సవరించారు. అలాగే ఇక్కడే ‘పంచాయితీ’లు నిర్వహిస్తారంటూ వంశీ పాత ఇంటి ప్రదేశాన్ని చూపించగా, అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అరవడం ఒక వంతయితే మరియు లాయర్ ఏమో ఏమైనా మాట్లాడుకుంటే వంశీతో మాట్లాడుకోండి అంటూ లోపలికి పంపించివేయడం పరిశీలించదగ్గ అంశం.

ఒక మీడియా ప్రతినిధి ఇంటర్వ్యూకు లాయర్ తో ఉన్న సంబంధం ఏమిటో అర్ధం కాని పరిస్థితి. ఇక, వంశీతో మొదలైన ఇంటర్వ్యూలో రాజకీయ ఆరోపణలు గురించి ప్రశ్నించగా యధావిధిగా వంశీ ఖండించడం జరిగింది. మద్దెలచెరువు సూరి హత్యకు సంబంధించిన విషయాలు మొదలుకుని జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ ల వరకు ప్రశ్నించిన విషయాలపై సంచలన జవాబులేవి వ్యక్తం కాలేదు గానీ, ‘ట్రూత్ యాప్’ (నిజం చెప్పించే యాప్) అంటూ వంశీ ఫింగర్ ప్రింట్స్ ను పెట్టి అడిగిన పలు ప్రశ్నలు ఆసక్తికరంగా సాగాయి.

2019 ఎన్నికలలో టిడిపి నుండి పోటీ చేస్తారా? వైసీపీ నుండి పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా, టిడిపి అని చెప్పిన జవాబుకు ‘తప్పు’ అన్న సిగ్నల్స్ ను ఇచ్చింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ లలో ఎవరి వైపు మొగ్గు అని ప్రశ్నించగా, వ్యాఖ్యల పరంగా చెప్పిన నారా లోకేష్ పేరు తప్పు అంటూ రావడం ఆసక్తికరంగా మారింది. ఇక, మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రమేయంపై అసలు తానూ ఈ యాప్ ను నమ్మనని వంశీ చెప్పడంతో, మీరు భయపడుతున్నారా? అని చెప్పి, దేవినేని నెహ్రూతో విభేధాలకు సంబంధించిన ప్రశ్నకు వంశీకి కావాల్సిన జవాబు యాప్ ఇవ్వడంతో కాస్త సంతృప్తి చెందారు.

అయితే ఏమనుకున్నారో ఏమో గానీ, ఈ యాప్ ఖచ్చితత్వంతో కూడుకున్నది కాదు అని వెంటనే ఒక ప్రకటన కూడా చేసారు సదరు మీడియా ప్రతినిధి. బహుశా వంశీ కోటరీలో ఉన్న బలగాన్ని చూసి శ్రేయస్కరం అనుకున్నారేమో గానీ, వంశీకి అనుకూలంగానే ఈ ఇంటర్వ్యూ ముగియడం విశేషం. ముఖ్యంగా కృష్ణాజిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా ఉండడంతో, ఈ ఇంటర్వ్యూ ద్వారా సంచలన విషయాలు వెలుగు చూస్తాయని భావించిన రాజకీయ వర్గాలకు, అలాంటిదేమీ జరగకపోవడం నిరుత్సాహకరమైన విషయం.