Director VV Vinayak as heroమాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివి వినాయక్‌. టాలీవుడ్‌ టాప్‌ హీరోలందరినీ డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ దర్శకుడు, కొంత కాలంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. వరుస ఫెయిల్యూర్స్‌తో వినాయక్‌ కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది.

ఈ తరుణంలో హీరోగా అవతారం ఎత్తనున్నాడు వినాయక్. దిల్‌ రాజు నిర్మాతగా శంకర్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన నరసింహారావు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు శీనయ్య అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అక్టోబర్ లో ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది.

రేప్ కు గురయ్యి ఆ తరువాత హత్య చెయ్యబడ్డ తన కూతురి మృగాళ్లపై పగతీర్చునే తండ్రి పాత్రలో వినాయక్ కనిపించబోతున్నాడు. దీనితో ఈ చిత్రాన్ని దిశకు అంకితం ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. దిశ ఘటనకు సంబందించిన కొన్ని విషయాలతో స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చెయ్యబోతున్నారట.

ఈ సినిమాలో వినాయక్‌కు ప్రతినాయకుడిగా టాలీవుడ్‌ యంగ్ హీరో నటించనున్నాడు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత విలన్‌గా, సపొర్టింగ్‌ రోల్స్‌లోనూ ఆకట్టుకుంటున్న నవీన్‌ చంద్ర ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడు. శ్రియ హీరోయిన్ గా కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.