V Hanumantha Rao Fires on KTRవిజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుండి మండిపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం ఇంకా ఆగినట్లు లేదు. ఈ సినిమాను చూసి చాలా బాగుందని చెప్పిన మంత్రి కేటీఆర్ పై కూడా మండిపడ్డ వీహెచ్, ఇలాంటి అసభ్యకరమైన సినిమాను చూసిన కేటీఆర్… ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు.

కేటీఆర్ కు హీరో విజయ్ దేవరకొండ బంధువవుతాడని… అందుకే సినిమా బాగుందని చెప్పారని, ఈ సినిమాలో హీరో డ్రగ్స్ తీసుకునే సన్నివేశాలు ఉన్నాయని… ఈ సినిమాను చూసి యువత పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కాకుండానే అమ్మాయిని తల్లిని చేసే సన్నివేశాలు ఉన్నాయని… మందు తాగి పేషెంట్లకు వైద్యం చేశానని హీరో గొప్పగా చెప్పుకునే సన్నివేశం ఉందని దుయ్యబట్టారు. వైద్యులపై కూడా ఈ సినిమా ప్రభావం పడే అవకాశం ఉందని, వెంటనే ఈ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

దీంతో మరోసారి హీరో విజయ్ కదనరంగంలోకి దూకాడు. ఇంతకుముందు ‘చిల్ తాతయ్య’ అంటూ కవ్వించిన విజయ్, తాజాగా దానికి ‘సీక్వెల్’ను అందించాడు. డియర్ తాతయ్యా… “అర్జున్ రెడ్డి” సినిమా బాగుందని కేటీఆర్ అనడంతోనే ఆయనకు నాకు బంధువైతే… అప్పుడు ఎస్.ఎస్.రాజమౌళి గారు నాకు నాన్న అవుతారు. ఆ తర్వాత… దగ్గుబాటి రానా, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ లు నా సోదరులు అవుతారు. నాకు సోదరీమణులు లేరు కాబట్టి, సమంతా రూత్ ప్రభు, అనూ ఇమ్మానుయేల్, మెహ్రీన్ పిర్జాదా నాకు మరదళ్లు అవుతారు.

అయిదు రోజుల్లో 5000 ప్రదర్శనలను హౌస్ ఫుల్ చేసిన నా స్టూడెంట్స్, పురుషులు, మహిళలు అందరూ నా కవలలు. ఆర్జీవి సార్ అయితే మన ఇద్దరిలో ఎవరి తండ్రో ఇంకా క్లారిటీ లేదు… “తాతయ్యా చిల్” అంటూ ఫేస్ బుక్ వేదికగా హీరో విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన వ్యంగ్యాస్త్రాలు వైరల్ అయ్యాయి. ఓ పక్కన వీహెచ్ వీరలెవల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిర్రుబుర్రులాడుతుంటే… మరో పక్కన విజయ్ మాత్రం సింపుల్ గా చిల్ తాతయ్య అంటూ మరింత మంటెక్కిస్తున్నాడు.