Uyyalawada-Family-Accuses-Chiranjeevi’s-Family]మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీటవ్వడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సినిమాను స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయతలు పరుచూరి బ్రదర్స్ కథ సహకారం అందించారు.

ఇక సినిమాను తెరకెక్కించాడానికి ముందు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. ఈ సినిమాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను వాడుకుంటున్నందుకు కొంత రొక్కం ముట్టజెబుతామని చిత్రబృందం హామీ ఇచ్చిందట. ఆ మాట నిలుపుకోకుండా చిత్రనిర్మాత రామ్ చరణ్ మొహం చాటేస్తున్నారని ఉయ్యాలవాడ వారసులు హైదరాబాద్‌లోని రామ్ చరణ్‌కు సంబంధించిన కొణిదెల ప్రొడక్షన్ హైస్ ముందు మెరుపు ధర్నాకు దిగారు.

అయితే చిత్రబృందం చెబుతున్న దాని ప్రకారం వారు దాదాపుగా 8 కోట్లు ఆశిస్తున్నారట. రామ్ చరణ్ వారికి ఇచ్చిన ఆఫర్ మాత్రం లక్షలలోనే అని సమాచారం. ఉయ్యాలవాడ వారసులు ప్రకారం తమ ఊరిలో షూటింగ్ పేరు చెప్పి చిత్రబృందం తమ పంటలు, పొలాలు కూడా నాశనం చేసిందని చెబుతున్నారు. మరి దీనిపై ‘సైరా నరసింహారెడ్డి’ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలకు సిద్ధం అవుతుంది.