uttej about ram gopal Varmaతెలుగు సినిమాలలో కమెడియన్ గా వేషాలు వేసిన ప్రముఖ నటుడు ఉత్తేజ్, స్వతహాగా రచయిత అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా… తన అనుభవాలను ఓ మీడియా ఛానల్ తో పంచుకున్నారు ఉత్తేజ్. తన గురువు గారితోనే ప్రారంభించిన ఉత్తేజ్… “దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే తనకు ఎంతో గౌరవమని, సినిమా కోసమే ఈ భూమి మీదకు వచ్చిన వ్యక్తి వర్మ అని, సినిమాలు చేసుకుని వెళ్లిపోతాడని” అన్నారు.

వర్మ గతంలో ఒకసారి సినిమాకు వెళ్లిన సంఘటనను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ… సంగీత్ థియేటర్లో ఇంగ్లీషు సినిమా చూసేందుకు వర్మ వెళ్లారు. అప్పట్లో, థియేటర్ బయట ఉండే బాక్స్ లో సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఉండేవి. ఆ బాక్స్ లో ఇంటర్వెల్ వరకు, ఆ తర్వాత సెకండాఫ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు వేర్వేరుగా ఉండేవి. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేందుకు ఆ ఫొటోలను పెట్టేవారు. అదే విధంగా, రాము గారు వెళ్లిన ఇంగ్లీషు సినిమాకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి.

ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చిన వర్మ, ఆ ఫొటోలను చూసి ఇంటర్వెల్ తర్వాత ఆ సినిమా అంత గొప్పగా ఉండదని భావించి, తన స్కూటర్ పై ఒక్కరే ఇంటికి వెళ్లిపోయారు. తీరా… ఇంటికి వెళ్లిన తర్వాత… ఇంట్లో వాళ్లు ప్రశ్నించిన తర్వాత ఆయనకు అసలు విషయం గుర్తుకు వచ్చింది… తన భార్యను థియేటర్లోనే వదిలేసి వచ్చానని! ఆ తర్వాత, రాము గారి భార్య ఆటోలో ఇంటికి వచ్చారు… అని చెబుతూ ఉత్తేజ్ పగలబడి నవ్వాడు. ఒక సినిమా కోసం అంతగా ఆలోచించే వ్యక్తి అని తన గురువు గారైన వర్మను పొగడ్తలతో ముంచెత్తారు ఉత్తేజ్.