uttam kumar reddy revanth reddyపీసీసీ అధ్యక్ష, పార్టీ కార్యవర్గ ప్రక్షాళన రేపోమాపో జరుగుతుందనే ఊహాగానాలకు తెరదించింది కాంగ్రెస్‌ అధిష్టానం. దానికి మరికొంత సమయం ఉందని, ఈలోగా ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే మరికొంతకాలం కొనసాగించాలని భావిస్తున్నట్టు సమాచారం. మరో ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఈ అంశం ప్రస్తావనకు రాకపోవచ్చని తెలుస్తుంది. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక, త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలు ఉండటం వల్ల దాని జోలికి వెళ్లకూడదని పార్టీ అధిష్టానం భావన.

మార్పు ఎప్పుడు జరిగినా టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేరుతోపాటు గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది. జాతీయ స్థాయిలో ఎన్నికలలో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ నాయకులు ఎంత నచ్చచెప్పినా దానిని తీసుకోవడానికి ఆయన ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో ఆ పదవికి వేరొకరిని ఎంపిక చెయ్యాల్సిన పరిస్థితిలో తెలంగాణపై దృష్టి పెట్టడానికి హై కమాండ్ కు సమయం లేదని తెలుస్తుంది.

ఏఐసీసీ అధ్యక్ష అంశం కొలిక్కి వచ్చాక త్వరలో అసెంబ్లీ ఎన్ని కలు జరగనున్న జార్ఖండ్, హరియాణా రాష్ట్రాలపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టనుంది. ఇది ఇలా ఉండగా బీజేపీకి రాష్ట్ర నాయకత్వ మార్పు ఖాయమని తెలుస్తుంది. అయితే బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ మాత్రం డీకే అరుణకు బలంగా మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. అయితే అరుణ అందరు నాయకులను కలుపుకుపోయే మనస్తత్వం తక్కువ దీని వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధిష్టానం కూడా భావిస్తుందంట. అయితే పార్టీలోకి కొత్తగా నాయకులు వస్తున్న తరుణంలో ఇప్పుడు నాయకత్వమార్పు అవసరం లేదని. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం వచ్చే బడా నాయకుల కోసం మరికొంత కాలం వేచి చూడాలని బీజేపీ అధినాయకత్వం కోరుకుంటుంది.