Uttam Kumar Reddy - dubbaka Telangana Byelectionsతెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తమ ఉనికిని చాటుకోవడానికి అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఆరాటపడుతున్నాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అవి కోరుకుంటున్నాయి. పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి మాత్రం దుబ్బాక నియోజకవర్గంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని అంటున్నారు.

మరోవైపు… బీజేపీ తమ గెలుపు ఖాయమని… ఇక్కడ నుండే రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన రఘునందరావు మీద సింపతి తమకు ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెబుతుంది. ఏది ఏమైనా దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నికను ప్రతిపక్ష పార్టీలు పెద్ద అంశంగా చేశాయి. ప్రభుత్వానికి రెఫరెండం అన్న స్థాయికి తెచ్చాయి.

ఒకవేళ తెరాస గెలిస్తే ఇక ప్రభుత్వ వ్యతిరేక గాలి… నిశ్శబ్ద విప్లవం వంటి మాటలు పనికి రావు. పైగా ఆ ఫలితం ఎంతో కొంత జీహెచ్ఎంసి ఎన్నికలలో తెరాస కు అనుకూలించవచ్చు. సహజంగా ఉపఎన్నికలలో అధికారపార్టీకి కొంత అనుకూలత ఉంటుంది. అందులోను చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తే కలిసిరావడం సహజమే.

ఇన్ని ప్రతికూలతల మధ్య దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నికను ప్రతిపక్షాలు పెద్దవి గా చేసి చూపెట్టడం సరైనదా అనేది చూడాలి. దుబ్బాక నియోజకవర్గానికి ఉపఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరుగుతుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తి అయ్యింది. నవంబర్ 16న కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.