bangalore-curfewకావేరీ జలవివాదంతో అట్టుడుకుతున్న కర్ణాటకలోని ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. తమిళులకు చెందిన హోటళ్లు, వాహనాలపై విరుచుకుపడుతూ, ఆందోళనకారులు యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. సోమవారం ఒక్కరోజే ఆందోళనకారులు దాదాపుగా వంద వాహనాలను తగలబెట్టారు. ఆందోళనను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం బెంగళూరులోని 16 పోలీస్ స్టేషన్లలో కర్ఫ్యూ విధించారు. దీంతో నగరంలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది.

బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాండ్యాలో ఈ నెల 17 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కర్ణాటకకు పంపించిన కేంద్రం, కర్ణాటక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేస్తూ, సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. జల వివాదంపై చర్చించేందుకు కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం అవుతోంది.

తమిళుల ప్రాణాలు, ఆస్తులు కాపాడాలంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాజా పరిణామాల నేపధ్యంలో బెంగుళూరు నగరాన్ని పర్యటించవద్దని తమ పౌరులను హెచ్చరించింది. బెంగుళూరులో అమెరికాకు సంబంధించిన ఐటీ కంపెనీలతో పాటు వివిధ సంస్థలు ఉండడంతో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.