US Box Office Collections - Jai lava Kusa, SPYder, Mahanubhavuduఈ దసరా పండగకు మూడు సినిమాలు ముస్తాబు కాగా, జూనియర్ “జై లవకుశ,” ప్రిన్స్ “స్పైడర్” సినిమాలు ఇప్పటికే ధియేటర్లలో సందడి చేస్తున్నాయి. అలాగే మూడో సినిమా శర్వానంద్ “మహానుభావుడు” కూడా మరికొద్దిగంటల్లో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని, అమెరికాలో ప్రదర్శితం కాబోతున్న ఫస్ట్ ప్రీమియర్ షో ద్వారా పరీక్షించుకోబోతోంది. మరి అదే యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే విడుదలైన రెండు సినిమాల పరిస్థితి ఏంటి? అలాగే ఈ ‘బొమ్మ’ స్థితిగతులు ఏంటి? అన్న విషయం పరిశీలిస్తే…

ముందుగా జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” చిత్రానికొస్తే… యుఎస్ మార్కెట్ హక్కులను 8.5 కోట్లకు కొనుగోలు చేయగా, బ్రేక్ ఈవెన్ రావాలంటే 1.8 మిలియన్ డాలర్స్ తప్పనిసరి. ప్రస్తుతానికి 1.4 మిలియన్ డాలర్స్ కు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఈ వీకెండ్ కు రాబోయే కలెక్షన్స్ తో దాదాపుగా క్లోజ్ అయినట్లే భావించవచ్చు. బ్రేక్ ఈవెన్ దశకు చేరుకోవడం కూడా కష్టమేనని భావిస్తున్న తరుణంలో… లాభాల మాట పక్కన పెడితే, భారీ నష్టాలను అయితే “జై లవకుశ” మిగల్చదు అన్న విషయం స్పష్టం.

ఆ తర్వాత యుఎస్ ‘కింగ్’ అయిన మహేష్ “స్పైడర్” విషయానికి వస్తే… 15.5 కోట్లకు కొనుగోలు చేయగా, బ్రేక్ ఈవెన్ దశకు రావాలంటే 4 మిలియన్స్ కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రీమియర్స్ తో 1 మిలియన్స్ తో ప్రారంభమైన ఈ సినిమా అసలు రేంజ్ తెలియాలంటే మరో రెండు రోజులు వేచిచూడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. రివ్యూలు ఆశాజనకంగా లేని దరిమిలా ఏ మేరకు ప్రేక్షకులను మహేష్ రప్పించగలుగుతాడో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సినిమాకు వచ్చిన టాక్ తో అయితే 4 మిలియన్స్ కు చేరుకోవడం అసాధ్యంగానే కనపడుతోంది.

ఇక మూడింటిలోకి సేఫ్ ప్రాజెక్ట్ గా “మహానుభావుడు” మరికొద్ది గంటల్లో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఈ సినిమాను 3.25 కోట్లకు కొనుగోలు చేయగా, బ్రేక్ ఈవెన్ కు చేరుకోవాలంటే 1 మిలియన్ సంఖ్యను చేరుకోవాల్సి ఉంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే… ఈ మూడింటిలోకల్లా లాభదాయకమైన ప్రాజెక్ట్ గా ‘మహానుభావుడు’ అవతరించనుంది. యుఎస్ మార్కెట్ ట్రెండ్ ను పరిశీలిస్తే… పాజిటివ్ మౌత్ టాక్ వచ్చిన చిన్న చిత్రాలు అవలీలగా 1 మిలియన్స్ సాధిస్తున్నాయి. దీంతో “మహానుభావుడు” పైనే అందరి చూపులు ఉన్నాయి.

ఒకవేళ అంచనా వేసిన విధంగా ‘మహానుభావుడు’కు పాజిటివ్ టాక్ వస్తే… ఈ ప్రభావం ‘స్పైడర్’పై ఖచ్చితంగా పడే అవకాశాలు కనపడుతున్నాయి. అదే జరిగితే యుఎస్ మార్కెట్ లో భారీ డిజాస్టర్ గా ‘స్పైడర్’ నిలవనుంది. ‘అతడు’ నుండి ‘శ్రీమంతుడు’ వరకు యుఎస్ మార్కెట్ లో వరుస హిట్లు కొట్టిన మహేష్ బాబు, గతేడాది ‘బ్రహ్మోత్సవం’ ద్వారా భారీ డిజాస్టర్ ను చవిచూడగా, “స్పైడర్” ఎటు వైపుకు పయనిస్తుందోనని అభిమానులు కూడా ఎంతో ఉత్కంఠతో వేచిచూస్తున్నారు.