Kabzaa Movieగ్యాంగ్ లీడర్ సినిమాలో నాని ఓ కథ రాద్దామని హాలీవుడ్ మూవీస్ ని వరసగా చూస్తుంటాడు. వాడుకోవడమెందుకు అవే రాసేస్తే పోలా అని టైటిల్స్ తో సహా మొత్తం డబ్బింగ్ చేసుకుని పేపర్లు నింపేస్తాడు. ఇదే సీన్ దర్శకుడు చంద్రుకి నిజ జీవితంలోనూ అనుభవంలోకి వచ్చినట్టు ఉంది. కెజిఎఫ్ ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్లు వసూలు చేసింది. మనమూ అలాంటిది తీసి ప్రశాంత్ నీలే కాదు మిగిలినవాళ్ళలోనూ అంతకన్నా గొప్ప టాలెంట్ ఉందని ప్రపంచానికి చాటాలి. అప్పుడే ప్రభాస్ లాంటి వాళ్ళు ఫోన్లు చేస్తారు.

అనుకున్నదే తడవుగా ఓ లైన్ రెడీ చేసుకుని స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టారు. ఒక దశ దాటాక అలాంటిదే రాయాలని తాపత్రయపడటం ఎందుకు దాన్నే కొంచెం అటుఇటుగా మారిస్తే పోలాని అమెజాన్ ప్రైమ్ లో సీన్ టు సీన్ చూసుకుంటూ కబ్జని సిద్ధం చేశారు. వినడానికి హాస్యాస్పదంగా అనిపించినా ప్యాన్ ఇండియా రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన ఈ మూవీ అయ్యాక ఇక్కడ చెప్పింది చాలా తక్కువనిపిస్తే మమ్మల్ని అడగండి. అంతగా థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ బుర్రలతో ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడు దర్శకుడు చంద్రు.

ఉపేంద్ర లాంటి హీరోని సరిగ్గా వాడుకోవాలే కానీ అతనితో అద్భుతాలు చేయించొచ్చు. కానీ కబ్జలో అలంటి రిస్కులేమీ చేయలేదు, రాఖీ భాయ్ ని ఆర్కేశ్వర్ గా మార్చేశారు. కోలార్ బంగారు గనులకు బదులు అమరపురం అనే ఊరిని సృష్టించారు. శ్రీనిధి శెట్టి స్థానంలో శ్రేయ శరన్ వచ్చి చేరింది. బారెడు మీసాలు విగ్గులు కాస్ట్యూమ్ లు అచ్చుగుద్దినట్టు వాటినే చేయించారు. సంజయ్ దత్ రేంజ్ లో ఓ హిందీ విలన్ ని పట్టుకొచ్చారు. యష్ హెలికాఫ్టర్ లో ఎంట్రీ ఇస్తే ఇందులో జైల్లో ఉన్న హీరో మీద దాడి చేసేందుకు విలన్ దాన్ని వాడతాడు.

ఇలా క్రియేటివిటీ మొత్తం కెజిఎఫ్ ని మక్కికి మక్కి దింపడానికి ప్రయత్నించినప్పుడు కొత్తగా అనిపించడానికి స్కోప్ ఎక్కడుంది. హీరోయిజం బిల్డప్పులతో చెవుల్లో నుంచి బ్లడ్డు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. తెరమీద రక్తం మన ఒంటికి అంటుకుందేమోనన్నంత హింస పలకరిస్తుంది. దీన్నే భరించలేం అనుకుంటే మధ్యలో పాటల హింస బోనస్. డబ్బింగ్ మీద శ్రద్ధ పెట్టలేదు. పోస్టర్లలో సుదీప్, శివరాజ్ కుమార్ లను చూపించారు కానీ ఆ పాత్రలకు ఇచ్చే ట్విస్టుకి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. రవి బస్రూర్ ఇంత వయొలెంట్ మ్యూజిక్ ఇవ్వగలడని మొదటిసారి అనిపిస్తుంది. మొత్తానికి కెజిఎఫ్ ఉచ్చులో పడిన కబ్జ ఎలాంటి రుచి లేని కిచిడీగా మిగిలిపోయింది.