సంక్రాంతి అల్లుళ్ళు అంటే... వీళ్ళ అల్లుళ్ళా..?‘ఎఫ్ 3’తో ఈ పండగకు సంక్రాంతి అల్లుళ్ళు సందడి చేస్తారనుకుంటే, ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాతో చివరికి ఓ నలుగురు ప్రముఖుల అల్లుళ్ళు సందడి చేయడానికి ముహుర్తాలు ఖరారు చేసుకున్నారు. మెగాస్టార్ అల్లుడు ‘సూపర్ మచ్చి’ రూపంలో వస్తుండగా, మహేష్ బాబు మేనల్లుడు “హీరో” ద్వారా తొలిసారిగా వెండితెరకు పరిచయం అవ్వబోతున్నారు.

అలాగే కృష్ణంరాజు అల్లుడు “డీజే టిల్లు” సినిమాతో వస్తుండగా, దిల్ రాజు అల్లుడు “రౌడీ బాయ్స్”గా రావడానికి రెడీ అయ్యారు. మొత్తంగా ఈ నలుగురు అల్లుళ్ళల్లో మెగాస్టార్ అల్లుడు ఇప్పటికే వెండితెరకు పరిచయం కాగా, మిగిలిన ముగ్గురు వారసత్వం ట్యాగ్ తో తెలుగు తెరపై తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.

మరి ఈ సంక్రాంతి అల్లుళ్ళు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో గానీ, ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాతో పెద్ద సినిమాలు రెడీ కాకపోవడంతో, సినీ ప్రేక్షకులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నలుగురు అల్లుళ్ళు కాకుండా, మరో రెండు సినిమాలు ‘అతిధి దేవోభవ’ మరియు ‘7డేస్ 6 నైట్స్’ కూడా సంక్రాంతి బరిలోకి దూకుతున్నాయి.