Unstoppable with NBK - Director Sukumar‘ఆహా’లో ప్రసారం అవుతోన్న ‘అన్ స్టాపబుల్’లో అసలైన బాలకృష్ణ స్వభావం అభిమానులకు కన్నులవిందుగా మారుతోంది. ‘కల్మషం’ అంటే తెలియకపోతే బహుశా బాలయ్యలానే ఉంటారేమో అనిపించే విధంగా సెలబ్రిటీలతో చెలరేగిపోతున్నారు నందమూరి నటసింహం.

తాజాగా సుకుమార్, రష్మిక మరియు అల్లు అర్జున్ లతో విడుదల చేసిన ఎపిసోడ్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ముఖ్యంగా సుకుమార్, రష్మికలను ఆటపట్టిస్తూ బాలయ్య వేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఏళ్ళ తరబడి సినిమాలు చేసే సుక్కుతో 3 నెలల్లో సినిమా పూర్తి చేయిస్తా అంటూ ‘లెక్కల మాస్టర్’ గారిపై పంచ్ లు విసిరారు.

నిజంగా మీ లాంటి వాళ్ళు తగులుకుంటే తప్ప సుకుమార్ మారడు అని అల్లు అర్జున్ కూడా ప్రస్తావించారు. ఇక ‘చందమామ’ అంటూ రష్మిక బాహ్యా సౌందర్యాన్ని కీర్తించిన బాలయ్య, ఇటీవల బసవతారకం హాస్పిటల్ కు విచ్చేసిన సందర్భంలో తన అంతః సౌందర్యం కూడా బయట పడిందంటూ ఓ వీడియోను ప్రదర్శించారు.

తాను ఓ పెద్ద స్టార్ హీరో అయ్యుండి, అల్లు అర్జున్ ఎంట్రీకి ఇచ్చిన ఎలివేషన్స్ మామూలుగా లేవు. అలాగే బన్నీతో కలిసి ‘పుష్ప’లో గూని గెటప్ లో నడిచి చూపించారు, రష్మికతో కలిసి ‘సామి సామి’ పాటకు స్టెప్పులు వేశారు. రష్మికను బన్నీ హగ్ చేసుకున్నప్పుడు బాలయ్య ఇచ్చిన హావభావాలు ఎపిసోడ్ మొత్తానికే హైలైట్ అనిపించే విధంగా నవ్వులు పూయించారు.

మొత్తమ్మీద మునుపెన్నడూ చూడని బాలకృష్ణను ఈ ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో ప్రేక్షకులు చూడగలుగుతున్నారు. ఫ్యాన్స్ ని కొట్టి తిట్టే వీడియోలే ఎప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవి, కానీ ఇపుడు సెలబ్రిటీలను బాలయ్య ఆటపట్టిస్తున్న వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ ‘కల్మషం’ లేకపోవడమే ఫ్యాన్స్ ను ‘జై బాలయ్య’ అనేలా చేస్తోంది.

https://twitter.com/anchor_swathi/status/1475309574970245121