KCR Chandrababu Meet Krishna Godavari Waters, Uma Bharti  KCR Chandrababu Naidu Meet Krishna Godavari Waters, Uma Bharti Meet KCR Chandrababu Water Issueరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడాలను పరిష్కరించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. కృష్ణానదిపై తెలంగాణ సర్కారు నిర్మించ తలపెట్టిన పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను నవ్యాంధ్ర తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్టులు కడితే కృష్ణా జలాల్లో చుక్క నీరు కూడా తమకు అందదని ఏపీ సర్కార్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ వివాదాన్ని పరిష్కరించే నిమిత్తం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి చేసిన యత్నాలు కూడా ఫలించలేదు.

రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల మధ్య జరిగిన చర్చలు ఏ మాత్రం ఫలితాన్నివ్వకపోగా… రెండు రాష్ట్రాల మధ్య విభేదాలను మరింతగా పెంచాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రిత్వ కార్యాలయం మరోమారు ఈ వివాద పరిష్కారానికి యత్నించాలని కేంద్ర జల వనరుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఉమా భారతి ఈ దఫా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ముఖాముఖీ కూర్చోబెట్టి చర్చలు జరిపితే తప్పించి సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు లేవని గ్రహించారు. ఇదే విషయాన్ని ఆమె ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులకు తెలిపారు.

తాజాగా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ నెల 11, 18, 19 తేదీల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య భేటీకి తాము సిద్ధంగా ఉన్నామని… మీ మీ సీఎంలకు అనుకూలమైన తేదీలను తెలిపితే భేటీని ఖరారు చేస్తామని ఆ లేఖలో అమర్ జిత్ సింగ్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ప్రత్యుత్తరాలు అందగానే ఇద్దరు సీఎంలతో కీలక చర్చలకు సంబంధించిన షెడ్యూల్, వేదిక ఖరారు కానున్నాయి.