union minister sujana Choudary son karthik caught on car racing in hyderabadటీడీపీ సీనియర్ నేత, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి ఇప్పటికే పలు ఆరోపణలతో సతమతమవుతున్నారు. అయితే తాజాగా సుజనాకు తన కొడుకు రూపంలో మరో చిక్కు వచ్చి పడింది. శుక్రవారం నాడు రాత్రి హైదరాబాద్ లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న కొడుకు కార్తీక్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అర్ధరాత్రి సమయంలో కొంతమంది మిత్రులతో కలిసి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ప్రత్యక్షమైన కార్తీక్… పంజాగుట్టకు దారి తీసే రోడ్డు మీదుగా కారు రేసింగులకు దిగినట్లు సమాచారం. ఈ రేసింగుల్లో సుజనా యూనివర్సల్ పేరిట రిజిస్టర్ అయిన ‘ఏపీ 09 సీవీ 9699’ కారుతో కార్తీక్ అక్కడికి రాగా… మరో మూడు కార్లు, పది బైకులపై అతడి మిత్రులు వచ్చారు.

ఆ సమయంలో రోడ్లపై 100 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో రయ్యిమంటూ దూసుకెళుతున్న కార్లను చూసిన నగర వాసులు బెంబేలెత్తిపోయి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ ఆర్ నగర్, మహంకాళీ స్టేషన్ పోలీసులు మెరుపు దాడి చేసి కార్తీక్ సహా మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కార్తీక్ పై ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణ కింద కేసు నమోదు చేశారు. సహజంగా ఈ ఆరోపణల కింద అదుపులోకి తీసుకున్న నిందితులకు కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత పోలీసులు వదిలేస్తున్నారు. మరి సుజనా తనయుడి ఉదంతంలో ఏం జరుగుతుందో చూడాలి.