Union Government Asks Jagan To Explainఏపీ ప్రభుత్వం వ్యవహార శైలి పై కేంద్రం సీరియస్. మద్యంపై రాబోయే ఆదాయాన్ని చూపి అప్పులు ఎలా చేస్తారు? అని లేఖ ద్వారా ప్రశ్నించింది. వెంటనే స్పందించి.. వివరణ ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి కబురు పంపింది.

మద్యంపై రూ.15వేల కోట్ల ఆదాయాన్ని కొదువ పెట్టి… ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తేవడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని చూపి, అప్పులు చేయడం ఆర్టికల్ 266(1)కి విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

అంతేకాకుండా విశాఖ కలెక్టరేట్ ఆస్తులతోపాటు పలు ప్రభుత్వ ఆస్తులను ఎలా తనఖా పెట్టారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాదాపుగా నెల క్రితం పీఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చారు. అయితే ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి మాత్రం ఊరికే తీసిపారేశారు.

రాజకీయ విమర్శలతోనే సరిపెట్టేశారు. ఇప్పుడు కేంద్రానికి ఏం సమాధానం చెబుతారు అనేది చూడాలి. అయితే ఈ వ్యవహారానికి బాధ్యత ఎవరు వహించాలి? మాములుగా అయితే ముఖ్యమంత్రి జగన్, ఆర్ధిక మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలి. అయితే ఇందులో మొత్తం అందరు బాధ్యులే.

ఈ ప్రతిపాదనను రూపొందించి, ఒకే చేసిన అధికారులు, కేబినెట్ కూడా బాధ్యులే. అయితే బాధ్యత ప్రభుత్వం దగ్గర ఆగిపోదు.. ఈ అప్పుని ఒకే చేసిన బ్యాంకులు, బ్యాంకు అధికారులు.. అలాగే బ్యాంకుల లీగల్ డిపార్టుమెంటులు అందరూ బాధ్యులే. పైగా ఋణం ఇచ్చిన బ్యాంకులన్నీ ప్రభుత్వ బ్యాంకులు కావడం విశేషం.

ఇప్పటివరకు ప్రైవేట్ వ్యక్తుల కోసం అడ్డదిడ్డంగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు ప్రభుత్వాల విషయంలో కూడా అలాగే చెయ్యడం కొసమెరుపు. ఈ మొత్తం ఉదంతాన్ని కేంద్రం వద్ద దాచిపెట్టడం ఇంకా దారుణం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణిస్తే అందుకు పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.