Undavalli Aruna Kumar Kapu reservation solution ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేయడం చంద్రబాబుకు చిటికెలో పని అని, అయిదు నిముషాల్లో పరిష్కారం అయ్యే సమస్యను తీర్చడం చంద్రబాబుకు ఇష్టం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబుపై విమర్శలు చేసారు. అలాగే ముద్రగడ డిమాండ్ చేస్తున్న తుని ఘటనలో కేసులు ఎదుర్కొంటున్నవారిని విడుదలలు కూడా, కేవలం ‘ఒకే ఒక రోజు’ పని అని, సదరు బెయిల్ ప్రొసెస్ ను వివరించారు.

ప్రభుత్వం కేసులు పెట్టిన వారు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటారని, అవి విచారణకు వచ్చినప్పుడు జడ్జి ఏమైనా అభ్యంతరముందా? అని అడుగుతారని, ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి అభ్యంతరం లేదని చెబితే… వారికి వెంటనే బెయిల్ మంజూరవుతుందని, మధ్యాహ్నానికల్లా ష్యూరిటీలు వస్తారు, సంతకాలు పెడతారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆర్డర్లు రెడీ అవుతాయి. ఐదు గంటల కల్లా వారు బయటకి వస్తారని… కళ్ళ ముందు ఓ సినిమా చూపించారు ఉండవల్లి.

ఈ మాత్రానికి ముద్రగడను వేధించాల్సిన అవసరం లేదని, గతంలో కులం పేరు చెప్పి రాయబారం నడిపిన వారు ముద్రగడను మోసం చేశారని, అందుకే ప్రభుత్వాన్ని నమ్మడం మానేశారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం గల ఉండవల్లి అరుణ్ కుమార్ నిందితులు ఎలా బెయిల్ తెచ్చుకోవాలో క్షుణ్ణంగా వివరించారు. బహుశా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి వారికి ఎలా బెయిల్ వచ్చిందన్న సమాధానాన్ని ఉండవల్లి పరోక్షంగా వివరించినట్లున్నారు.

5 నిముషాల్లో పరిష్కారం అయ్యే సమస్యను తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పదేళ్ళలో 5 నిముషాలు కూడా దొరకలేదా? అన్న ప్రశ్నలు ప్రజల వద్ద నుండి వ్యక్తమవ్వడం సహజమే! నడిచే వాడు మనోడు కాకపోతే ఢిల్లీని కూడా నడుచుకుంటూ 5 నిముషాల్లో చేరుకోవచ్చు అన్నాడట… లోగడ ఇలాంటి వారే..!