Undavalli Arun Kumar met kcrమాజీ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్‌ ఆదివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్‌, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీకి చెందిన ఉండవల్లితో సమావేశం కావడం చాలా ఆశ్చర్యకరమే. నిన్న సాయంత్రం 6 గంటలకు ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రగతి భవన్‌ చేరుకొని కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

వారు ఆ సమావేశంలో కేసీఆర్‌ స్థాపించబోయే భారత్‌ రాష్ట్రీయ సమితి పార్టీ ఏర్పాటు, అది స్థాపిస్తే తెలంగాణలో టిఆర్ఎస్‌ పార్టీకి ఎదురయ్యే సాంకేతిక, రాజకీయ సమస్యలపై చర్చించారనే వార్తలు వచ్చాయి. కానీ ఇదే అంశం గురించి కేసీఆర్‌ చర్చించాలనుకొంటే తెలంగాణలోనే హేమాహేమీలైన అనేక న్యాయవాదులున్నారు. కనుక భిన్న ధృవాలవంటి ఉండవల్లి, కేసీఆర్‌ భేటీకి ఇంతకు మించి బలమైన కారణం ఏదో ఉందనే చెప్పవచ్చు.

అంతకు ముందు కేసీఆర్‌, ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌తో సుదీర్గంగా ప్రగతి భవన్‌లో భేటీ అయ్యి రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి పోటీగా అభ్యర్ధిని నిలబెట్టడం, జాతీయ రాజకీయాలలో ప్రవేశించడంపై చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్‌, మిత్రపక్షాలన్నీ కలిసి ఎన్డీయేకి పోటీగా ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని భావిస్తున్నాయి.

ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరుకావలసిందిగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ సిఎం కేసీఆర్‌తో సహా 22 మందికి లేఖలు వ్రాశారు. కాంగ్రెస్, బిజెపిలతో సమానదూరం పాటించాలని భావిస్తున్న సిఎం కేసీఆర్‌, కాంగ్రెస్ ప్రతినిధులు హాజరయ్యే ఆ సమావేశానికి హాజరవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కనుక ఆ సమావేశానికి హాజరయ్యే ముందుగానే ఉండవల్లి ద్వారా కేసీఆర్‌ కాంగ్రెస్ అధిష్టానానికి ఏమైనా సందేశం పంపాలనుకొంటున్నారా?లేదా రాష్ట్రపతి ఎన్నికలలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏ పార్టీలు విప్ జారీ చేయకూడదు కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ఏపీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఉండవల్లికి ఉన్న పరిచయాలతో మిత్రపక్షాల అభ్యర్ధికి మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారా?అనే సందేహాలు ఏర్పడ్డాయి. కనుక తెలంగాణ సిఎం కేసీఆర్‌, ఉండవల్లి అరుణ్ కుమార్‌ భేటీకి చాలా ప్రాధాన్యత ఉంది. వారిరువురూ కలిసి ఏమి చేయబోతున్నారనేది త్వరలో తెలుస్తుంది.