Undavalli-Arun-Kumar-ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజనకు వ్యతిరేకంగా తాను దాఖలు చేసిన పిటిషన్‌పై… కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయకపోవడం శోచనీయమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేస్తే… కేంద్రాన్ని నిలదీయొచ్చని ఉండవల్లి చంద్రబాబుకు సూచించారు. అసలు విభజన బిల్లు పార్లమెంట్ లో పాస్ కాలేదని ఉండవల్లి వాదన. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆయనతో కలిసి పోరాడాలంట. ఆస్తులు, అప్పులు పంపకాలు చాలా వరకు పూర్తయ్యి, ఇప్పటికి నాలుగు బడ్జెట్లు విడిగా ప్రవేశపెట్టుకున్నాక బిల్లు పాస్ అవ్వలేదు అని తీర్పు వచ్చినా ఏం లాభం?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను మళ్ళీ కలిపేస్తారని ఏమైనా అనుకుంటున్నారా ఉండవల్లి గారు? రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇలాంటి కబుర్లే చెప్పి ప్రజలని ఏమార్చారు. తాజాగా ఇలాంటి ప్రయత్నమే మరొకటి. దానికి అన్నీ వదిలేసి రాష్ట్రప్రభుత్వం కూడా కలిసి వచ్చి సుప్రీం కోర్టులో అక్షింతలు వేయించుకోవాలంట.

రెటైర్మెంట్ ఇచ్చేసారు కాబట్టి ఉండవల్లి ఇలాంటి వాటికి కావాల్సినంత సమయం ఉంటుంది. విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సౌలభ్యం ఉండదు కదా. ఒకవేళ సమయం ఉన్నా పార్లమెంట్ కు ఉండే విశేషాధికారాలతో కోర్టు జోక్యం లేకుండా చేస్తారు చివర్లో. కాబట్టి ఈ ప్రయత్నం వల్ల ఎవరికీ ఉపయోగం లేదనే చెప్పుకోవాలి.