Undavalli Arun Kumar polavaram projectచంద్రబాబు నాయుడు హయాంలో పరుగులు పెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులన్నిటినీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ అంటూ బ్రేకులు వేసి నిలిపివేశారు. కాంట్రాక్టర్లతో కమీషన్ల బేరసారాలన్నీ పూర్తయ్యి మళ్ళీ నెమ్మదిగా పనులుమొదలుపెట్టేసరికి ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్వ్ దెబ్బతినడంతో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి చేయగలమో చెప్పలేమని చేతులెత్తేశారు. పోలవరం ప్రాజెక్టు ఎలాగూ పూర్తవదు కనుక దానిలో నీళ్ళు నింపబోమని సిఎం జగన్మోహన్ రెడ్డి ముంపు గ్రామాల నిర్వాసితులకు హామీ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. పోలవరం పాపం చంద్రబాబు నాయుడి ప్రభుత్వానిదే అంటూ మంత్రి అంబటి రాంబాబు కూడా చేతులు దులుపేసుకొన్నారు. ఇదీ… ఇంతవరకు సాగిన పోలవరం సీరియల్ కధ.

దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందిస్తూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, “జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి చంద్రబాబు, జగన్, దేవినేని ఉమ, అనిల్ కుమార్‌ చేయని సాహసం చేశారు. నేను బ్రతికి ఉండగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని అనుకోవడం లేదు. డయాఫ్రం వాల్వ్ కొట్టుకుపోయింది కనుక పనులు జరుగడం లేదని అంబటి రాంబాబు చెపుతున్నారు. ఆనాడు దానిని నిర్మించినప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు. దానిని నిర్మించిన కాంట్రాక్ కంపెనీయే ఇప్పుడూ పనిచేస్తోంది. మరి వారిని నిలదీసి అడగవచ్చు కదా?వారిని బాధ్యులను చేయడం మానేసి చంద్రబాబుని, దేవినేనిని ఆడిపోసుకొంటూ కాలక్షేపం ఎందుకు చేస్తున్నట్లు?

అసలు ప్రాజెక్టులో అతిముఖ్యమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం కట్టకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పుకోవడమే తప్పు. స్పిల్ వే, కాఫర్ డ్యాం నిర్మించి గోదావరి నీళ్ళను కాస్త పక్కకు పారిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయినట్లేనా? ఆ మాత్రం దానికే భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంటే జగన్ ప్రభుత్వం ఏమి చేస్తోంది?

అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు పూర్తయింది? ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత అవసరం?తదితర అంశాలతో జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. తమది చాలా పారదర్శకమైన ప్రభుత్వం అని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటున్నారు కనుక పోలవరం ప్రాజెక్టు విషయంలో పూర్తి వివరాలను బయటపెట్టి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాలి,” అని అన్నారు.