Jagan initiates talks with Jyothula Nehruసుదీర్ఘ రాజకీయ ప్రస్థానం జ్యోతుల నెహ్రూ సొంతం. అలాగే రాజకీయాల్లో ఆజాత శత్రువుగా కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ముద్ర వేయించుకున్నారు. వ్యక్తిగతంగా చిన్న మచ్చ కూడా లేని జ్యోతుల నెహ్రూ ఏ పార్టీలో ఉన్నా… ఆ పార్టీకి అది అదనపు బలమే అవుతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. గతంలో టీడీపీ నేతగా కొనసాగిన జ్యోతుల వైసీపీ ఆవిర్భవించాక జగన్ చెంత చేరిపోయారు.

పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి విషయంలోనూ మంచి సలహాలిస్తూ కీలక నేతగా ఎదిగిన జ్యోతుల, అసెంబ్లీలో వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత పదవిని దక్కించుకున్నారు. అయితే భూమా నాగిరెడ్డి పార్టీ మారడంతో ఖాళీ అయిన పీఏసీ చైర్మన్ పదవి భర్తీ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం జ్యోతులతో పాటు పార్టీ నేతలను షాక్ కు గురి చేసింది. మెజారిటీ ఎమ్మెల్యేలను కాదని జగన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం… మెట్ట ప్రాంతంగా పేరు గాంచిన ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీని ఖాళీ చేసేలానే కనపడుతోందని పొలిటికల్ వర్గాల టాక్.

గడచిన ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి సింగిల్ సీటు కూడా దక్కలేదు. ఇక జ్యోతుల పుణ్యమా అని తూర్పు గోదావరి జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరాయి. జగ్గంపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన జ్యోతుల తాను గెలవడంతో పాటు మరో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జ్యోతుల వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జ్యోతుల తోడల్లుడు వరుపుల సుబ్బారావు టిడిపిలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇక ఆ జిల్లాకు చెందిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జ్యోతుల, వరుపుల టీడీపీలో చేరిన తర్వాత వారిద్దరూ అదే బాట పట్టనున్నట్లు సమాచారం. మిగిలిన మరో ఎమ్మెల్యే కూడా జ్యోతుల దారిలోనే నడిచే అవకాశాలు లేకపోలేదు. ఇక ఏదో పార్టీ మారుతున్నామంటే మారుతున్నామని కాకుండా తన సత్తా ఏమిటో తెలిసేలా జిల్లాలోని వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా తన వెంట తీసుకెళ్లాలని జ్యోతుల భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెరసి జ్యోతుల వైసీపీని వీడితో ‘మెట్ట’ సీమలో జగన్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.