Umpires Call for Lunch With India Needing Two Runs for Victoryభారత్-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో అంపైర్ల తీరు క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ మ్యాచ్‌ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 118 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

భారత జట్టు విజయానికి మరో రెండు పరుగుల దూరంలో ఉన్నప్పుడు 19 ఓవర్ల వద్ద అంపైర్లు మ్యాచ్‌ ను నిలిపివేసి లంచ్ బ్రేక్ ప్రకటించారు. మరో ఓవర్‌తో మ్యాచ్ ముగియనున్న వేళ అంపైర్లు బ్రేక్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కామెంటేటర్లు, క్రీడా పండితులు విరుచుకుపడ్డారు. 2 పరుగులు అవసరమైన వేళ 40 నిమిషాల బ్రేక్ ఏంటంటూ దుమ్మెత్తి పోశారు.

టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా అంపైర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే క్రికెట్ నిబంధనల ప్రకారమే అంపైర్లు అలా చేయాల్సి వచ్చింది. నిజానికి వన్డే మ్యాచ్‌ లో ఓ ఇన్నింగ్స్ ముగిశాక అంటే 50 ఓవర్లు ముగిశాక ఇన్నింగ్స్ బ్రేక్ ఉంటుంది. నాలుగైదు, ఓవర్ల ముందు ఇన్నింగ్స్ ముగిసినా బ్రేక్ కొనసాగుతుంది.

అయితే ఆదివారం నాటి మ్యాచ్‌ లో దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. అంటే నిబంధనల ప్రకారం ఇంకా 18 ఓవర్ల ఆట మిగిలి ఉంది. ఈ కారణంగానే నిబంధనలను అనుసరించి పరుగులతో నిమిత్తం లేకుండా ఆటను నిలిపివేశారు. ఏది ఏమైనా ఇండియా 2-0 ఆధిక్యంలో ఉండడం అభిమానులకు ఆనందాన్నిస్తోంది.