indian-style-cricketఎలాంటి టీంనైనా మట్టి కరిపించడం, అలాగే ఎలాంటి ప్రత్యర్ధి చేతిలో అయినా ఓటమి పాలు కావడం టీమిండియాకు ఆది నుండి ఉన్న రికార్డే. అందుకే టీమిండియా ఆడుతున్న మ్యాచ్ లంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉత్సుకత, ఉత్సాహం రెండూ ఉంటాయి. అలాగే టీఆర్పీ రేటింగ్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టే స్పాన్సర్లు ‘క్యూ’లు కడుతుంటారు. ఈ వ్యాఖ్యలు అక్షర సత్యాలు అన్న విషయం మరోసారి హోలీ పండుగ పర్వదినాన జరిగిన బంగ్లా – టీమిండియా మ్యాచ్ చెప్పింది.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాను కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రదర్శించి బంగ్లా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్ లో తన బౌలర్లను వినియోగించుకున్న మొర్తజా కెప్టెన్సీపై క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. టీమిండియాలో ఎలాంటి బంతినైనా బౌండరీ అవతలకు అవలీలగా పంపించే సత్తా కోహ్లి, యువరాజ్, ధోని వంటి వారికి అసలు బ్యాట్ కనెక్ట్ కావడమే గగనంగా మారిన తరుణంలో టీమిండియా స్కోరు బోర్డు వేగం నత్తనడకన సాగింది. చివరి 5 ఓవర్లలో కేవలం 34 పరుగులు మాత్రమే చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇక, ఓ మాదిరి లక్ష్యాన్ని చేధించే క్రమంలో బ్యాటింగ్ దిగిన బంగ్లా బ్యాట్స్ మెన్లు భారత బౌలర్లపై దూకుడుని ప్రదర్శించారు. తొలి వికెట్ ను మిథున్ రూపంలో కోల్పోయిన బంగ్లా జట్టు 95 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకున్న తరుణంలో మొహ్మదుల్లా, సౌమ్య సర్కార్ లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ఈ క్రమంలో భారీ షాట్లకు ప్రయత్నించిన సర్కార్ కోహ్లికి దొరికిపోయాడు. అక్కడితో ప్రారంభమైన బంగ్లా పతనం మ్యాచ్ చివరి బంతుల్లో కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండా ఓటమి పాలయ్యింది.