Two wheeler discount saleబీఎస్-3 వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆటోమొబైల్ తయారీ కంపెనీలు తమ వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలను వీలైనన్ని వదిలించుకునేందుకు భారీ రాయితీలు ప్రకటించాయి. బీఎస్-3 కాలుష్య ప్రమాణాలు కలిగి ఉన్న వాహనాలను ఏప్రిల్ 1 నుంచి నిషేధిస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. సదరు వాహనాలను విక్రయించడం కానీ, రిజిస్ట్రేషన్ కానీ కుదరదని తేల్చి చెప్పింది. దీంతో కంపెనీలు ఇప్పటికే తమ వద్ద ఉన్న బీఎస్-3 వాహనాలను విక్రయించుకునే పనిలో భారీ ఆఫర్లు ప్రకటించాయి.

అయితే గడువుకు ఒక్క రోజు (మార్చి 31వ తేదీ) మాత్రమే మిగిలి ఉండడంతో, ఈ ఆఫర్ ఒక్క రోజుకే పరిమితం కానుంది. తొలుత ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు హీరో మోటో కార్ప్, హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో మిగిలిన కంపెనీలు కూడా అదే బాట పట్టాయి. హీరో మోటో కార్ప్ స్కూటర్లపై 12,500, ప్రీమియం బైక్‌లపై 7,500, ప్రారంభ స్థాయి మోడళ్లపై 5,000 తగ్గింపును ప్రకటించగా హెచ్‌ఎంఎస్‌ఐ అన్ని వాహనాలపై 10 వేల డిస్కౌంట్ ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం 8 లక్షల వాహనాలపై పడగా వీటిలో 6.71 లక్షల ద్విచక్ర వాహనాలే ఉండడం గమనార్హం.

ఒక్క హీరో మోటో కార్ప్‌ కంపెనీ పరిధిలోనే 2 లక్షల వాహనాలు ఉండగా, టాటా మోటార్స్ వద్ద 30 వేలు ఉన్నట్టు అంచనా. ఇక కంపెనీ ప్రకటించిన రాయితీలతో పాటు డీలర్లు సైతం ఆఫర్లు ఇస్తున్నారు. డిస్కౌంట్లు ప్రకటించడంతో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని డీలర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌ లో ఒక్కో డీలర్‌ వద్ద 200–300 వరకు ద్విచక్ర వాహనాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఒక్క రోజులోనే వాటిని విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పాత కస్టమర్లకు ఫోన్లు చేసి మరీ ఆఫర్ల గురించి చెబుతున్నారు.