AP Telanganaఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పునర్విభజన జరిగి నేటికీ 9 ఏళ్ళు. ఈ తొమ్మిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దూసుకుపోతుంటే, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయింది.

తెలంగాణలో ఎక్కువగా వినిపించే మాట అభివృద్ధి తర్వాత సంక్షేమ పధకాలు కాగా, ఏపీలో ఎక్కువగా వినిపించే మాట సంక్షేమ పధకాలు, రాజకీయాలు. కనుకనే తెలంగాణ అంతగా అభివృద్ధి చెందుతుంటే ఏపీ మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోయింది.

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, మౌలికవసతుల కల్పన కోసం అప్పులు చేస్తుంటే, ఏపీలో వైసీపీ ప్రభుత్వం తన ఓటు బ్యాంకు బలోపేతం చేసుకోవడం కోసం అప్పులు చేసి సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సంపద పెంచుకొని దానితో సంక్షేమ పధకాలు అమలుచేస్తుంటే, ఏపీ ప్రభుత్వం సంక్షేమ పధకాల కోసమే అప్పులు చేస్తున్నందున రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.

ఏపీలో కలుషిత రాజకీయ వాతావరణం, రాజకీయ కోణంలో నుంచే విధానాలు, నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం లేదనేది బహిరంగ రహస్యం. ఏపీకి ఉన్న సహజవనరులను కూడా ప్రభుత్వం వినియోగించుకొని వాటి నుంచి ఆదాయం సమకూర్చుకొనే ఆలోచన చేయకుండా, సంక్షేమ పధకాల భారాన్ని ప్రజలపైనే వేసి ముక్కు పిండి వసూలు చేసుకొంటోంది.

తెలంగాణతో పోలిస్తే ఏపీలో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ఆకర్షణ కేంద్రాలు చాలా ఎక్కువే ఉన్నాయి. అటు తిరుపతి మొదలు ఇటు శ్రీకాకుళంలో అరసవెల్లి వరకు ఏపీలో పుణ్యక్షేత్రాలకు లెక్కే లేడు. అన్నిటికీ మించి ఇటు శ్రీకాకుళం నుంచి అటు నెల్లూరు వరకు ఏపీలో అతి పొడవైన సముద్రతీరం, ఏడాది పొడవునా గలగల పారే కృష్ణాగోదావరి, వాటి ఉపనదులు అనేకం ఉన్నాయి. వీటితో ఆక్వా, పర్యాటక రంగాల అభివృద్ధికి చాలా అవకాశం ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే.

ఇక విశాఖకు రామకృష్ణా బీచ్‌ బ్రాండ్ ఇమేజ్‌ వంటిది. కానీ సముద్రతీరం కోతకు గురవుతున్నా, బీచ్‌లో కాలువలు, వ్యర్ధాలు కలిపేస్తున్నా పట్టించుకొనే నాధుడే లేడు.

పర్యాటకశాఖ మంత్రి రోజమ్మకు ఈ పర్యాటక ఆకర్షణ కేంద్రాల గురించి ఆలోచించే తీరిక, శక్తీ, ఆసక్తి ఏవీ లేవు. అందుకే నెలనెలా ఓసారి తిరుమలకి, ఓసారి తాడేపల్లికి వెళ్ళి వస్తూ మిగిలిన సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను విమర్శించేందుకు కేటాయిస్తుంటారు.

ఏపీలో ఉన్న సహజవనరుల కారణంగా రాష్ట్రంలో అనేక రకాల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేసుకొనే అవకాశం పుష్కలంగా ఉంది. ఉదాహరణకు ఏపీలో విస్తారంగా మామిడి, చెరుకు, టొమేటో, మొక్కజొన్న, అరటి, వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలు పండిస్తాయి. కనుక వాటికి అనుబందంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. కానీ విజయనగరం జిల్లాలో నడుస్తుండే చెరుకు క్రషింగ్ కంపెనీలు, చిట్టివలస జూట్ మిల్లులే మూతపడ్డాయి. ఇక ప్రభుత్వం కొత్తగా పరిశ్రమలు స్థాపిస్తుందని ఎలా అనుకోగలము?

ప్రభుత్వం పట్టించుకొనప్పటికీ ఏపీ ఆక్వా రంగం నేటికీ దేశంలో అగ్రస్థానంలోనే ఉంటోంది. అలాగే గ్రానైట్, మైనింగ్, రవాణా రంగాలలో ఏపీదే పైచేయి. కానీ వాటిని పట్టించుకొనే నాధుడే లేడు. అదే…రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాలకు కాస్త చేయూతనిస్తే అవే ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని పోషించగలవు.

ఏపీకి ఉన్న ఈ సహజవనరులు తెలంగాణకు లేనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చెరువులలో పూడికలు తీయించి, వాటిని ప్రాజెక్టు కాలువలతో అనుసంధానం చేసి, వాటిలో చేప పిల్లలను పెంచుతూ ఆక్వా రంగాన్ని సృష్టించుకొని దాని నుంచి ఆదాయం సమకూర్చుకొంటోంది. ఏపీలో సిద్దంగా ఉన్న ఆక్వారంగాన్ని నిర్లక్ష్యం చేయడమే కాక దానిపై కూడా చార్జీల భారం మోపుతుండటంతో రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్న అవి అప్పులలో కూరుకుపోయి మూతపడుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి మేకలు, గొర్రెలను కొనుగోలు చేసి తమ రాష్ట్రంలో వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తూ, ఇతర రాష్ట్రాలకు మాంసం ఎగుమతి చేసే స్థాయికి చేరుకొంటోంది. కానీ తెలంగాణకు గొర్రెలు,మేకలు సరఫరా చేస్త్తున్న ఏపీ మాత్రం ‘గొర్రె తోక బెత్తెడే’ అన్నట్లు ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోయింది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒకేసారి ఏర్పడినా, పాలకుల ఆలోచనావిధానం, నిబద్దతలో తేడా ఉన్నందున తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే, ఏపీలో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అన్ని రంగాలలో వెనకబడిపోయి ఆదుకొనే నాధుడు కోసం దీనంగా ఎదురుచూస్తోంది.