Mahendra Singh Dhoniఎంతటి గొప్ప బ్యాట్స్ మెన్ కైనా ‘బాడ్ ఫేజ్’ కామన్… అనేది క్రికెట్ విజ్ఞత ఉన్న వారికి తెలిసిన అంశం. ప్రస్తుతం ఆ ‘బాడ్ ఫేజ్’లోనే టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కొట్టుమిట్టాడుతున్నారు. ఒకప్పుడు జట్టు ఆపదలలో ఉంటే, ముందుగా తాను బ్యాటింగ్ కు వచ్చి క్రీజులో నిలబడి అండగా ఉండే ధోని, ఇప్పుడు కీలకమైన సమయాలలో తన వంతుగా కనీసం 30 పరుగులు చేయాలన్నా కూడా క్రీజులో ఉండలేని పరిస్థితి నెలకొంది.

టీ20 సిరీస్ నుండి మహేంద్ర సింగ్ ధోనిని తప్పించడంపై ఇటీవల బీసీసీఐపై అభిమానులు మండిపడ్డారు. కానీ విండీస్ తో మూడవ వన్డే ముగిసిన తర్వాత బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సముచితమైనదేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. కీపర్ గా ధోని ప్రతిభ ఇప్పటికీ అమోఘమైనప్పటికీ, బ్యాట్స్ మెన్ గా విఫలమవ్వడం జట్టును కలచివేస్తోంది. ఈ మ్యాచ్ కాకపోతే వచ్చే మ్యాచ్ లో అయినా స్థాయికి తగిన విధంగా రాణిస్తారన్న నమ్మకం కూడా రానూరానూ సన్నగిల్లుతోంది.

ధోని ఫుట్ మూవ్ మెంట్ గానీ, షాట్ సెలక్షన్ గానీ… అతని బ్యాటింగ్ మీద అతనికే విశ్వాసం లేనట్లుగా ఉంది. నిజానికి ఇలాంటి ఫేజ్ నే గతంలో లెజండరీ క్రికెటర్లు గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, సచిన్ లు చవిచూశారు. నాడు జట్టుకు వీరంతా దూరం కావడానికి కారణం కూడా ధోనినే అని చెప్పడంలో సందేహం లేదు. మరి అలాంటి ధోని, ఇపుడు తాను జట్టుకు భారం అవుతుంటే తప్పుకోకుండా ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారన్న విమర్శలకు తానే తావిచ్చినట్లవుతోంది.

ఓ పక్కన రిషబ్ పంత్ వంటి యువ క్రికెటర్లు జట్టులో స్థానం కోసం నిరీక్షిస్తుంటే, ధోని తనంతట తానుగా తప్పుకోకుండా జట్టు నుండి తప్పించుకునే వరకు చేయడం ఎందుకు? టీ20 నుండి తప్పించినట్లే, వచ్చే సిరీస్ కు వన్డేల నుండి కూడా తప్పిస్తే, ధోనికి అంతకు మించిన పరాభవం మరొకటి ఉంటుందా? టీమిండియాకు అత్యుత్తమైన కెప్టన్ గా బాధ్యతలు నిర్వహించిన ధోని కెరీర్ ను ఇలా ముగించడం అస్సలు ఊహించగలమా? తన కెరీర్ గురించి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత అయితే ధోనికి వచ్చిందన్నది స్పష్టం.