Netaji Subash Chandra boseనేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై నెలకొన్న మిస్టరీకి ఇది మరో ట్విస్ట్. ఈ నెల 27న విడుదలైన నేతాజీ ఫైల్స్ లో ఉన్న వివరాల ప్రకారం, 1963 ప్రాంతంలో ఉత్తర బెంగాల్ లోని షాలుమారి ఆశ్రమంలో కేకే భండారీ పేరిట నేతాజీ నివాసమున్నారని, ఈ విషయంపై నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చర్చించారని తెలుస్తోంది. 1960 ప్రాంతంలో షాలుమరి బాబానే నేతాజీ అని దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది.

ఈ ఫైల్స్ లో ఉన్న వివరాల ప్రకారం, 1963లో ఆశ్రమం కార్యదర్శి రమణి రంజన్ దాస్ స్వయంగా భండారీ విషయాన్ని నెహ్రూ దృష్టికి తీసుకు వెళ్లారట. అయితే మే 23, 1963న నెహ్రూ తన ముఖ్య కార్యదర్శి కే రామ్ ను పిలిపించి సదరు భండారీ ఎవరో తేల్చాలని ఆదేశించగా, ఆయన టాప్ సీక్రెట్ మెమో ద్వారా అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ బీఎన్ మల్లిక్ కు సందేశం పంపారని తెలుస్తోంది. విచారణ జరిపిన మీదట మరో టాప్ సీక్రెట్ ను నోట్ రూపంలో జూన్ 12న సమాధానం ఇచ్చారని, అదే సంవత్సరం సెప్టెంబరు 7, నవంబర్ 11, నవంబర్ 16న పలు రహస్య దస్త్రాలు ప్రధాని కార్యాలయం, ఐబీ కార్యాలయం మధ్య తిరిగాయని తెలుస్తోంది.

దాదాపు 37 సంవత్సరాల తర్వాత అంటే 1999లో నేతాజీ అదృశ్యంపై నిజానిజాలు తేల్చేందుకు ఏర్పాటు చేసిన ముఖర్జీ కమిషన్ ఈ దస్త్రాలను పరిశీలించి, ఆయన నేతాజీ కాదని నివేదిక ఇచ్చింది. అయితే, ఈ తాజా దస్త్రాలతో ఆయన షాలుమరి బాబా కాకపోవచ్చేమో గానీ, కేకే భండారీ పేరిట ఆశ్రమంలో ఉండి వుండవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.