Twist in gangeshananda theerthapada caseదేశంలోనే అత్యంత సంచలనం సృష్టించిన కేరళ స్వామీజీ అత్యాచార యత్నం కేసులో ఊహించని ట్విస్టు ఎదురయ్యింది. ఎర్నాకులం జిల్లా కొల్లాంలోని పద్మనా చట్టంబి స్వామి ఆశ్రమానికి చెందిన గంగేశానంద తీర్థపాద ఓ యువతిపై కన్నేసి ఆమె ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి ప్రయత్నించడం… ప్రతిఘటించిన సదరు యువతి ఓ పదునైన కత్తితో అతడి రహస్యాంగాన్ని కోసివేసిందని పోలీసులు కేసు నమోదు చేయడం… జరిగిపోయింది. బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించడంతో స్వామి కోలుకున్నాడు.

తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడని, ప్రతిఘటించినా వినకపోవడంతో తాను ఆ పని చేయక తప్పలేదని బాధిత యువతి గతంలో పేర్కొంది. దీంతో నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు మంచి పనే చేసిందని, అత్యంత ధైర్యసాహసాలతో వ్యవహరించిందని సీఎం పినరయి విజయన్‌ కూడా ప్రశంసించారు. అయితే ఇప్పుడు ఈ కేసు ఊహించని మలుపు తీసుకుంది. తాజాగా బాధితురాలు మాట మారుస్తూ ఇచ్చిన స్టేట్మెంట్ పోలీసు వర్గాలనే అవాక్కు చేసింది.

కోర్టుకు ఇచ్చిన టెలిఫోన్ వాంగ్మూలంలో స్వామి గంగేశానంద తీర్థపాద తనకు తండ్రి లాంటి వాడని, తనపై అత్యాచారయత్నం చేయలేదని, తాను స్వామిజీ మర్మాంగాన్ని కోయలేదని పోలీసులే స్వామిజీకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని షాకిచ్చింది. అంతే కాకుండా తనకు అయ్యప్పదాస్ అనే వ్యక్తితో సంబంధం ఉందని, ఆయనతో స్వామీజీకి ఆర్థిక వివాదాలున్నాయని తెలిపింది. దీంతో ఈ కేసులో తీర్పు గురించి ఆసక్తి వ్యక్తం చేసినవారంతా షాక్ తిన్నారు.

అయితే బాధిత యువతి తల్లిదండ్రులను స్వామిజీ మనుషులు ఆధీనంలో పెట్టుకొని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చి కేసును నీరు గార్చే ప్రయత్నంలో భాగంగా ఆమెతో ఇలా మాట్లాడించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం స్వామి గంగేశానంద తీర్థపాద మాట్లాడుతూ… తన రహస్యాంగాన్ని తానే కోసుకున్నానని మరో బ్రహ్మాండమైన షాక్ ఇచ్చారు. అలా ఎందుకు కోసేసుకున్నారు? అంటే దానితో ఇక పని లేదని కోసేసుకున్నానని చెప్పగా, దీనిని పోలీసులు రికార్డు చేశారు. ఇండియాలో ఎప్పుడు ఏదైనా జరుగుతుంది అన్న దానికి మరో నిదర్శనం!