allu-arjun duvvada-jagannadhamహరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న “దువ్వాడ జగన్నాధమ్” సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. వరుసగా మూడు సంవత్సరాల నుండి సమర్లో విడుదల చేస్తూ, ‘హ్యాట్రిక్’ విజయాలను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తాజా సినిమా కూడా వచ్చే ఏడాది వేసవికాలానికి సిద్ధం కానుంది. అయితే ఈ సినిమాపై ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది.

‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమాలో అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణ యువకుని పాత్రలో నటించబోతున్నాడని అవాక్కయ్యే వార్త హల్చల్ చేస్తోంది. బహుశా టైటిల్ రీత్యా వెలుగులోకి విషయమో ఏమో గానీ, బన్నీ క్యారెక్టర్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత తరం నటుల్లో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ‘బ్రాహ్మణ’ యువకుని పాత్రలో కనిపించారు. వినాయక్ ‘అదుర్స్’ చిత్రంలో ‘చారి’ పాత్రకు ప్రాణం పోసిన జూనియర్ ఎన్టీఆర్, ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడంలో సక్సెస్ సాధించిన వైనం తెలిసిందే.

ఒకవేళ బన్నీ ‘బ్రాహ్మణ’ పాత్రలో నటిస్తే… తారక్ తర్వాత ఆ పాత్రను ధరించిన నటుడిగా కీర్తి పొందుతాడు. అలాగే ‘సరైనోడు’లో పక్కా మాస్ పాత్రలో కనిపించిన బన్నీని సరికొత్తగా చూసే అవకాశం సినీ ప్రేక్షకులకు కలుగుతుంది. అయితే ఎంతవరకు బన్నీ ఈ పాత్రలో పరాకాయ ప్రవేశం చేస్తాడనేది వేచిచూడాలి.