tv9-v6-malafied-practises-suspendedప్రస్తుత ప్రపంచంలో మీడియాల మధ్య ఉన్న పోటీ వాతావరణం తెలియనిది కాదు. తమ ఛానల్ ను నెంబర్ 1లో నిలపాలని మీడియా వర్గీయులు చేస్తున్న జిమ్మిక్కులు అన్ని ఇన్ని కావు. అయితే టాప్ చైర్ లో తిష్ట వేసుకుని కూర్చున్న టీవీ 9 వంటి మీడియా ఛానల్ కూడా అలాంటి అనైతిక చర్యలకు పాల్పడడం విస్తుగోలిపే అంశం. ప్రతి వారం డేటాను అందించే బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్) తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం రెండు తెలుగు మీడియా ఛానల్స్ ను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది.

ఇందులో ప్రముఖంగా టీవీ9 ఛానల్ ఉండడం గమనార్హం. తొలి తెలుగు న్యూస్ ఛానల్ గా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న టీవీ9 మరియు ఇప్పుడిప్పుడే తెలంగాణాలో బాగా పాపులర్ అవుతోన్న వి6 ఛానల్స్ రేటింగ్స్ కోసం కక్కుర్తి పడి నిబంధనలను అతిక్రమించాయని, ఈ పరిణామంతో సదరు రెండు ఛానల్స్ ను తాజాగా ప్రకటించిన 46వ వారం నుండి 49వ వారం వరకు రేటింగ్స్ లో పరిశీలనలోకి తీసుకోమని, ఈ నాలుగు వారాలు సస్పెండ్ చేసామని ‘బార్క్’ వివరణ ఇచ్చింది.

టీవీ 9 సస్పెండ్ తో 46వ వారానికి గానూ రెండవ స్థానంలో ఉన్న టీవీ 5 అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఎన్టీవీ, 10టీవీ, ఏబీఎన్, టీ న్యూస్ ఛానల్స్ టాప్ 5 స్థానాలలో నిలిచాయి. ఆ తదుపరి స్థానాల్లో ఈ టీవీ ఏపీ, సాక్షి, స్టూడియో ఎన్, ఐ న్యూస్, జెమిని న్యూస్ నిలిచాయి. ‘కట్నం తీసుకునే వాడు గాడిద’ అంటూ ‘నీతి సూక్తులను’ వెల్లడించే టీవీ 9, రేటింగ్స్ విషయంలో ఇంతలా దిగజారుతుందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.