raviprakash-jaganమీడియా రంగంలోకి ‘సాక్షి’ రాకతో జర్నలిజం పార్టీల వారిగా చీలిపోయింది. అంతకు ముందు వరకు రాజకీయ పార్టీలకు పలు మీడియా వర్గాలు కాస్త సహాయ సహకారాలు అందించిన మాట వాస్తవమే అయినప్పటికీ, సాక్షి చేసిన ప్రసారాలు తెలుగునాట సరికొత్త జర్నలిజాన్ని పరిచయం చేసాయి. ఈ ప్రభావం ఖచ్చితంగా ప్రత్యర్థి మీడియా వర్గాలపై కూడా పడింది. దీంతో ఆయా మీడియాలపై మండిపడం జగన్ వంతయ్యింది. అసెంబ్లీ వంటి పలు సందర్భాలలో ‘మీ గెజిట్’ అంటూ జగన్ టీవీ9, ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై బాహాటంగానే అధికార పక్షంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ వ్యాఖ్యలను ‘లైట్’గా తీసుకున్న మీడియా వర్గాలు అవకాశం చిక్కినప్పుడు మాత్రం ఏకిపారేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో టీవీ9 సీఈవో రవిప్రకాష్ చేరినట్లున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొన్న రవిప్రకాష్, అవినీతిపై ప్రసంగించారు. దేశంలో ఓ ఏడెనిమిది కుటుంబాలే రాజకీయాలను శాసిస్తున్నాయని, అధికార పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా పార్టీలు, రాజకీయ నేతలు అవినీతిలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. వేల కోట్ల కుంభకోణాలు చేసినవారు రాజకీయాల్లో చలామణి అవుతున్నారని, బ్యాంకుల్ని నిండా ముంచిన వాళ్ళు నాయకులుగా మారారని… ప్రజల్లో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నందు వలనే ఇది సాధ్యపడుతోందని, రాజకీయాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు.

అవినీతి విషయంలో ఎవరైనా అధికార ప్రభుత్వాన్ని విమర్శించడం సహజమే. ‘అధికారం’ ఎంతటి కార్యాన్నైనా చేసి చూపిస్తుంది కాబట్టి ‘అవినీతి’ అన్నది ‘పవర్’ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ, రవిప్రకాష్ అధికార ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాన్ని కూడా విమర్శించడం, అలాగే వేల కోట్లు కుంభకోణాలు చేసిన వారు రాజకీయాల్లో ఎదగడం అంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ ను టార్గెట్ చేసినవేనని విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న మాటలు. గతంలో జగన్ – రవిప్రకాష్ ల మధ్య హాట్ హాట్ చర్చలు జరిగాయని రాజకీయ, మీడియా వర్గాల్లో వార్తలు వినపడ్డ నేపధ్యంలో ప్రస్తుతం రవిప్రకాష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.