tv9 media insulted vishwak senభారత్‌లో అగ్రస్థానంలో ఉన్న న్యూస్ ఛానల్‌ టీవీ9 తాము మెరుగైన సమాజం కొరకు పనిచేస్తున్నట్లు చెప్పుకొంటుంది. మామూలు వార్తలను కూడా సెన్సేషన్ చేసే దురలవాటున్న టీవీ9 ప్రముఖుల, ప్రజల వ్యక్తిగత జీవితాలలోకి జొరబడిపోయి సంచలన వార్తలు ప్రసారం చేసేస్తుంది.

ఇందుకు తాజా ఉదాహరణగా టీవీ9 స్టూడియోలో తెలుగు వర్ధమాన నటుడు విశ్వక్ సేన్‌కు జరిగిన ఘోర అవమానం గురించి చెప్పుకోక తప్పదు. టీవీ 9 స్టూడియోలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో వర్ధమాన నటుడు విశ్వక్ సేన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమం హోస్ట్ చేస్తున్న టీవీ9 యాంకర్ ఆయనను ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడటంతో మొదట షాక్ అయిన విశ్వక్ సేన్‌ వెంటనే ఘాటుగా బదులిచ్చారు.

“నన్ను మీ స్టూడియోకి ఆహ్వానించి నేను మానసిక ఒత్తిడిలో ఉన్నానంటూ కామెంట్స్ చేయడం, ఈవిదంగా అవమానించడం సబబు కాదు. నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేహక్కు మీకు లేదు. మీరు ఈవిదంగా నా గురించి అనుచితంగా మాట్లాడినందుకు నేను మీ మీద కోర్టులో కేసు వేయగలను కానీ అలా చేస్తే మీకు నాకు తేడా ఏముంటుంది? అందుకే వెయ్యను. కానీ మీరు కాస్త నాలుక అదుపులో ఉంచుకొని మాట్లాడితే బాగుంటుంది,” అని ఘాటుగా బదులిచ్చారు.

కనీసం అప్పుడైనా టీవీ 9 యాంకర్ తన తప్పును సరిదిద్దుకొని ‘పొరపాటున మాట్లాడాను… క్షమించమని’ అడిగి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ చాలా నిర్లక్ష్యంగా ‘యు గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో…’ అంటూ వెళు చూపుతూ పదేపదే చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలు కూడా షాక్ అయ్యారు.

ఈ అవమానం భరించలేని విశ్వక్ సేన్‌ను “అసలు ఈ స్టూడియోకి రావడమే పెద్ద పొరపాటు,” అంటూ కార్యక్రమంలో మద్యలో లేచి వెళ్ళిపోయారు.

మెరుగైన సమాజం కోసం పనిచేస్తున్నామని గొప్పగా చెప్పుకొనే టీవీ9 సినీ పరిశ్రమలో ఒడిదుడుకులను తట్టుకొంటూ ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతున్న ఓ వర్ధమాన నటుడుని స్టూడియోకి పిలిచి ఈ విదంగా ఆహ్వానించి ఈవిదంగా అవమానించడం దేనికి?అతని వ్యక్తిగత జీవితంలో జొరబడి లక్షలాది ప్రేక్షకుల ముందు అవమానించే హక్కు టీవీ9కి ఎవరిచ్చారు?అసలు తమ స్టూడియోకి వచ్చిన అతిధితో ఈవిదంగా మాట్లాడటాన్ని టీవీ9 ఏవిదంగా సమర్ధించుకొంటుంది?

టీఆర్‌పీ పెంచుకోవడం కోసం చేసే ఇటువంటి పనుల వలన ప్రముఖులు ఇబ్బంది పడుతుంటారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మంత్రులను ఉద్దేశ్యించి టీవీ9 అనుచిత వ్యాఖ్యాలు చేసినందుకు సుమారు ఏడాదిపాటు తెలంగాణ రాష్ట్రంలో బహిష్కరణకు గురైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయిన దాని తీరు మారలేదని చెప్పడానికి ఇదే ఓ తాజా నిదర్శనం.