Tummala Nageswara Raoమాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధ పడిపోతున్నారు. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కష్టపడి ఎక్కువ మంది సర్పంచులను గెలిపించుకున్నా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాను అనే బాధ ఆయనలో ఉండిపోయింది. ఎన్నికల ఓటమి నుండి బయటకు రాలేకపోతున్నారట. నిన్న మాట్లాడుతూ … “అసెంబ్లీ ఎన్నికల్లోనే కొంతమంది నాయకులు తల్లిలాంటి పార్టీకి మోసం చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితికు తీరని ద్రోహం’’ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మలను ఓడించామని రాక్షసానందం పొందుతున్నారనీ.. అది వారికీ, వారి భవిష్యత్‌ తరాలకు తీరని అన్యాయం చేసినట్లేనన్నారు. పార్టీని మోసం చేసిన వారు రాజకీయాల్లో రాణించలేరని చెప్పారు. సీఎం కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే తుమ్మల గతం మరిచిపోయినట్టుగా ఉన్నారు. ఒకప్పటి ఆయన మాజీ తల్లికి (రాజకీయ నాయకులకు పార్టీ మారినప్పుడల్లా తల్లులు మారతారు మరి) చేసిన ద్రోహం మరిచిపోయినట్టున్నారు.

2014 లో కేవలం నామా నాగేశ్వరరావు తో ఉన్న వివాదాల వల్ల ఒకరి మీద ఒకరు కుతంత్రాలు పన్నుకుని మొత్తం పార్టీని జిల్లాలో ఓడించారు. గెలవాల్సిన ఇద్దరూ ఓడిపోయారు. ఆ తరువాత తల్లి లాంటి పార్టీని వదిలేసి కొత్త తల్లిని వెతుకున్నారు. టీడీపీ తుమ్మల సొంత తల్లి అనుకుంటే తెరాస పెంచిన తల్లి…. కాకపోతే ఆయనకు కన్న తల్లి మీద ప్రేమ లేదు. కన్న తల్లిని ఓడించే ప్రయత్నం కూడా చేశారు కదా. కాబట్టి పార్టీలు మారే రాజకీయ నాయకులు పార్టీని తల్లితో పోల్చడం మానేస్తే వారికీ మంచిదీ సమాజానికీ మంచిది.