Tummala Nageswara Raoఈరోజు జరిగిన కేబినెట్ విస్తరణలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కుతుంది అందరూ భావించారు. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆయన ఓడిపోయినా ఎమ్మెల్సీగా మంత్రివర్గంలోకి వస్తారని అంతా భావించారు. అయితే కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీనికి కారణం ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చెయ్యనుండడమే అని తెలుస్తుంది. ఇటీవలే జరిగిన పంచాయితీ ఎన్నికలలో కూడా భారీ ఎత్తున పంచాయితీలలో పార్టీని గెలిపించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోను గత ఎన్నికలలో తెరాస భారీ విజయం సాధించినా ఖమ్మంలో కేవలం ఒకే ఒక్క స్థానము గెలిచింది. కాంగ్రెస్ ఆరు, టీడీపీ రెండు, ఒక్క స్వతంత్రుడు గెలిచారు. జిల్లా లో పార్టీ ఓటమి వెనుక టీఆర్‌ఎస్‌ వర్గ విభేదాలే కారణమన్న ప్రచారం సాగుతోంది. టీఆర్‌ఎస్‌లోని విభేదాలు జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపించాయని కేసీఆర్ కూడా విశ్లేషిస్తున్నారు. దీనితో తుమ్మల అయితేనే కరెక్టు అభ్యర్థి అని ఆయన భావిస్తున్నారట. మరోవైపు కేబినెట్ విస్తరణ లో పక్కన పెట్టిన హరీష్ రావు ఈ లోకసభ సెగ్మెంటుకు ఇంఛార్జ్ గా వేస్తారని వార్తలు వస్తాయి.

ఉద్యమ సమయం నుండీ ఎన్నో కష్టతరమైన ఎన్నికలను గెలిపించిన హరీష్ అయితే ఇక్కడ గెలవడం సులువు అని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ ఎన్నికలలో తెరాస ఎలాగైనా 16 సీట్లు (మరో సీటు మిత్రపక్షం ఎంఐఎం) సాధించి కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. అన్నీ సీట్లలో కల్లా ఖమ్మం లో గెలవడమే కీలకమని కేసీఆర్ భావిస్తున్నారు. హరీష్ రావు, కేసీఆర్ కూడా ఈ ఎన్నికలలో ఎంపీలుగా పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.