Tummala Nageswara Rao about TRS loss in Telangana Electionsకొద్ది రోజులు క్రితం తెరాస ఓడిపోతే నాకు పెద్దగా నష్టం లేదు, వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా అని ఒక బహిరంగసభలో కేసీఆర్ అన్న మాటలు కలకలం సృష్టించాయి. 100కు పైగా సీట్లు కొడతాం అని చెప్పే కేసీఆర్ నోటా పరాజయం ఏంటి అని విశ్లేషణలు చేశారు రాజకీయ పరిశీలకులు. ఒక మీడియా చెప్పినట్టు మహాకూటమి ఈ ఎన్నికలలో గెలుపొందే అవకాశం ఉందా అని అంతటా చర్చ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ కాబినెట్ లో మరో మంత్రి కూడా సరిగ్గా ఈ మాటే అని పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేశారు.

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను అసలు ఈ ఎన్నికలలో పోటీ చెయ్యకూడదని అనుకున్నానని అయితే తన సొంత జిల్లా కు మేలు చేకూర్చే సీతారామా ప్రాజెక్టు పూర్తి చెయ్యడానికి తిరిగి పోటీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఈ సారి తాను ఓడిపోతే తనకు ఎంతమాత్రం నష్టం లేదని హాయిగా ఇంట్లో కూర్చుని వ్యవసాయం చేసుకుంటా అని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో తెరాస శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతున్నాయి. రాజకీయ వర్గాలలో ఖమ్మం జిల్లాలో 75% కంటే ఎక్కువ స్థానాలు మహాకూటమి గెలవబోతుంది అనే చర్చ జరుగుతుంది.

తుమ్మల కూడా ఓడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో తుమ్మల నోటి వెంట వచ్చిన ఈ మాట పార్టీలో కలకలం సృష్టించింది. నిజంగానే తెరాస ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయా? రాష్ట్రవ్యాప్తంగా గులాబీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి? ఎనిమిది నెలల ముందు శాసనసభను రద్దు చేసి కేసీఆర్ తప్పు చేశారా అంటూ ప్రశ్నలు మొదలవుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు జవాబు మాత్రం డిసెంబర్ 11న ఫలితాలు వచ్చినప్పుడే వస్తుంది. తెరాస ఓడిపోతే మాత్రం అది సంచలనమే.