TTV Dinakaran - Tamil Nadu Politicsఎలక్షన్ కమిషన్ కు లంచం ఇవ్వజూపిన కేసులో గత మూడు రోజులుగా ఢిల్లీ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీ-టీవీ దినకరన్, తొలుత నిజం ఒప్పుకోకపోయినా, ఆపై పోలీసులు చూపిన వీడియో సాక్ష్యంతో దిమ్మ తిరిగిపోయి నిజం చెప్పాడు. విశ్వసనీయ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం… తొలుత మధ్యవర్తి సుకేష్ ఎవరో తెలియదని, ఆపై ఆయనో హైకోర్టు న్యాయమూర్తిగా భావించి మాట్లాడానని చెప్పిన దినకరన్, ఆపై సుకేష్ తో ఉన్న పరిచయాన్ని అంగీకరించాడు.

సుకేష్ తో పరిచయం, అది ఎలా కొనసాగింది? డబ్బును ఢిల్లీకి ఎలా పంపించారు? ఎవరి ద్వారా ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలని అనుకున్నారు? ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? ఇత్యాది విషయాలను పూస గుచ్చినట్టు చెప్పేశాడు. ఈ కేసులో జోక్యం ఉన్న మరింత మందిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకీ దినకరన్ తో నిజం కక్కించిన ఆ వీడియోలో ఏముంది? అన్నది తమిళనాట ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి సుకేష్ ను విచారించిన తరువాత ఈ కేసులో దినకరన్ చేసిన లంచం కుట్ర విషయం బయటకు వచ్చింది. ఆపై వారిద్దరికీ ఉన్న సంబంధాలపై జనార్దనన్, మల్లికార్జున అనే వ్యక్తుల నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. ఇక దినకరన్ ను విచారిస్తున్న వేళ, తొలుత వీరిద్దరి పేర్లనే పోలీసులు ప్రస్తావించారు. ఆపై తాను సుకేష్ తో మాట్లాడిన మాట వాస్తవమేనని, అయితే, అ వ్యక్తే సుకేష్ అని తెలియదని, న్యాయమూర్తితో మాట్లాడానని అనుకున్నానని బుకాయించబోయాడు.

దీంతో పోలీసులు వారి వద్ద ఉన్న వీడియో అస్త్రాన్ని బయటకు తీశారు. దినకరన్, సుకేష్ ల మధ్య జరిగిన సంభాషణ వీడియోను చూపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేని పరిస్థితిని సృష్టించారు. దీంతో సుకేష్ తో తన పరిచయాన్ని దినకరన్ అంగీకరించి, చేసిన తప్పంతా చెప్పుకొచ్చాడు. ఈ కేసులో వరుసగా నాలుగో రోజు దినకరన్ ను పోలీసులు విచారణకు పిలిచారు. అయితే ఏ క్షణంలోనైనా దినకరన్ ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తమిళనాట భారీగా ప్రచారం జరుగుతోంది.