TTV Dinakaran camp opposes AIADMK merger!జయలలిత మరణం తర్వాత కుదేలవుతున్న తమిళనాడు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ రచ్చ రచ్చగా మారిన వైనం తెలిసిందే. శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత కాస్త సర్దుమనిగినట్లుగా కనిపించినా, పన్నీరు సెల్వం తిరుగుబాటుతో మళ్ళీ మొదటికొచ్చింది. అయితే ప్రస్తుతం శశికళనే పార్టీ నుండి బహిష్కరించి, పన్నీరు – పళని వర్గాలు కలిసిపోయాయి. దీంతో సమస్యలు తీరిపోతాయి అనుకున్న తరుణంలో… దినకరన్ కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనపడుతున్నాడు.

అన్నాడీఎంకే పార్టీ నుంచి శశకళను శాశ్వతంగా బహిష్కరించేందుకు పన్నీరు సెల్వం, పళనిస్వామి పార్టీ ఎమ్యెల్యేలతో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో శశికళతో పాటు ‘టీ టీవీ’ దినకరన్ ను కూడా పార్టీ నుంచి బహిష్కరించనున్నారు. అయితే పార్టీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసే అధికారం పార్టీ ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఉందని, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అని దినకరన్ వర్గం స్పష్టం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దినకరన్ అయితే మరో అడుగు ముందుకేస్తూ… తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం విలీనం చెల్లదని చెప్తూ… గవర్నర్ ను కలిసి విలీనంపై ఫిర్యాదు చేస్తానని అన్నారు. అలాగే తన వద్ద 25 మంది ఎమ్యెల్యేలు ఉన్నారని, ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తాను చెప్పలేనని, పదవిని కాపాడుకునేందుకు పన్నీర్‌, పళని కలిశారని ఆరోపణలు చేసారు. ఈ కలయిక పట్ల ఎమ్మెల్యేలు సుముఖంగా లేరని, పలువురు ఎమ్మెల్యేలు తమను సంప్రదించి, ఈ విలీనంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.